రాజధానిలో రగడ | District issue has been reached out to Common Capital | Sakshi
Sakshi News home page

రాజధానిలో రగడ

Published Mon, Sep 1 2014 4:40 AM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM

District issue has been reached out to Common Capital

ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ ఇంటిపోరు రాజధానికి చేరింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ నాయకులతో జిల్లా నాయకులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి, జిల్లాలోని సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఇప్పటికే అటు రేణుకా చౌదరి వర్గీయులకు, ఇతర వర్గీయులకు సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ నాయకులు సమాచారం అందించడంతో వారి వారి అనుచరులను సమావేశానికి రప్పించుకుని తమ బల నిరూపణ కోసం ఇరు వర్గాల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.
 
 గత వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ మేథోమధన కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరై వారి అభిప్రాయాలను వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించాలని ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు జిల్లా నేతలకు సూచించారు. అయితే ఈ సమావేశానికి ముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని ఇటీవల జరిగిన మేథోమధన సదస్సుకు ఆహ్వానించడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై రేణుకా చౌదరి వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గమనించిన ఏఐసీసీ నాయకులు పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కుంతియాను జిల్లాకు పంపించి ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదుర్చాలని భావించారు. అయితే కుంతియా రాకముందే జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సోమవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించేందుకు ఏఐసీసీ ముహూర్తం నిర్ణయించింది.
 
 పార్టీ పరిస్థితిపై చర్చించేనా..?
 జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారా.. అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలతో రేణుకా చౌదరి వర్గానికి చెందిన 14 మందిని సస్పెండ్ చేసినా, వారిని సైతం మేథోమధన సదస్సుకు ఆహ్వానిం చారు. ఈ పరిస్థితిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది జరిగిన వారం రోజులకే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
 
 ఈ పరిస్థితులను గమనించిన ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్‌సింగ్, కుంతియా సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని జిల్లా కాంగ్రెస్ నాయకులతో భేటీకి సిద్ధమయ్యారు. కోరం కనకయ్యతో ప్రారంభమైన వలసల పరంపరకు చెక్ పెట్టడంతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ వర్గీయులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన రేణుకా చౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు కలిసి పనిచేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే చర్చ కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సోమవారం జరిగే సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలోనే జిల్లా కాంగ్రెస్‌ను ఏకతాటిపై నడిపించే నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement