బీసీల ఓట్లకు ‘కులగణన’ అస్త్రం | AICC leader Praveen Meeting At Gandhi Bhavan With Congress Leaders | Sakshi
Sakshi News home page

బీసీల ఓట్లకు ‘కులగణన’ అస్త్రం

Published Wed, Jan 24 2024 5:32 AM | Last Updated on Wed, Jan 24 2024 5:32 AM

AICC leader Praveen Meeting At Gandhi Bhavan With Congress Leaders - Sakshi

భేటీలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో కోమటిరెడ్డి, దీపాదాస్‌ మున్షీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ ‘కులగణన’అస్త్రాన్ని ప్రయోగించనుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కులగణన కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. కులగణనకు అనుకూలంగా ఇప్పటికే రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఈ గణన ఇప్పటికే ప్రారంభించడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చిన విషయం విదితమే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చనున్నారన్న చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పడం ద్వారా బీసీవర్గాల ఓట్లు రాబట్టుకునే అంశంపై మంగళవారం టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా చర్చ జరగడం గమనార్హం.  

అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యయనం  
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఏఐసీసీ ప్రతినిధులు వెళుతున్నా రు. అందులో భాగంగానే జాతీయ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ చైర్మన్, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ చక్రవర్తి మంగళవారం తెలంగాణకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో తయారీకి టీపీసీసీ నియమించిన కమిటీతో ఆయన గాందీభవన్‌లో భేటీ అయ్యారు. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌మున్షీ, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌బిన్‌ హందాన్, లింగంయాదవ్, రవళిరెడ్డి, కోట నీలిమ, పోట్ల నాగేశ్వరరావు, సామా రామ్మోహన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, రియాజ్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర నేతల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పీపుల్స్‌ ఫ్రెండ్లీగా ఉందని, క్షేత్ర స్థాయిలోని అంశాలనూ టచ్‌ చేశారని అభినందించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు విస్మరించే వర్గాలను కూడా మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లు, ఇళ్లలో పనిచేసే వారి గురించి అధ్యయనం చేసి, వారి సమస్యలను కూడా ప్రస్తావించామని వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల ముందు ఒక మేనిఫెస్టో ఉంచగలిగామని చెప్పారు. ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని, ఈ హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.  

ఒకట్రెండు ఆలోచనలు ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయి – ప్రవీణ్‌ చక్రవర్తి 
సమావేశ అనంతరం దీపాదాస్‌ మున్షీ, ఇతర తెలంగాణ నేతలతో కలిసి ప్రవీణ్‌చక్రవర్తి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ప్రజలు, నిపుణులు, పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో ముఖ్య సాధనమని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతుందని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పాటు పౌర సంఘాలు, కొందరు ప్రజలతో సమావేశమయ్యామన్నారు. ఈ చర్చల్లో వచి్చన ఫీడ్‌బ్యాక్‌ నుంచి ఒకట్రెండు ఆలోచనలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించే ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయని ప్రవీణ్‌ చక్రవర్తి చెప్పారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement