'కొందరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే..'
హైదరాబాద్ : డీఎల్ఎఫ్ భూముల బదలాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురవారం శాసనసభలో ప్రకటన చేశారు. డీఎల్ఎఫ్ భూముల బదలాయింపులపై చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ డీఎల్ఎఫ్ సంస్థ రూ.580 కోట్లతో 31.31 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. డీఎల్ఎఫ్కు ప్రత్యామ్నాయ భూములు రాయదుర్గం వద్ద కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. సెప్టెంబర్ 2013లో భూములు రిజిస్ట్రేషన్ అయినట్లు ఆయన తెలిపారు. శేరిలింగంపల్లిలోని 471 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించారని కేసీఆర్ పేర్కొన్నారు. అందులో కొంత భూమిని ఏపీఐఐసీ విక్రయించి ప్రభుత్వానికి నిధులు ఇచ్చిందన్నారు.
సభలో వ్యక్తులు తమ స్థాయిని బట్టి విమర్శలు చేయాలని....అంతేకానీ ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయటం సరికాదని కేసీఆర్ అన్నారు. కొందరు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీఐఐసీ భూములు అమ్మవద్దని ఎన్నోసార్లు ఆందోళన చేశామని కేసీఆర్ తెలిపారు. తమది ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని, ఎన్నికల్లో గెలిచి వచ్చిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.