కొలిక్కిరాని కొత్త ‘కాప్స్’
ఒకే పోలీస్ విధానం, కొత్త యూనిఫాంపై విస్తృతస్థాయి చర్చ
ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్ర పోలీసుశాఖలో ఒకే పోలీస్ విధానం, కొత్త యూనిఫాంకు సంబంధించి విస్తృత్తస్థాయి చర్చ జరపాలని, ఆ తర్వాతే తుది నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయమై తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా పోలీసుశాఖకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ అధికారులు, నిపుణులు, ఇతర సంస్థలతో విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను సవ్యంగా ఉంచడమే గాకుండా పోలీసుశాఖలో వివిధ స్థాయిల్లో జరుగుతున్న నియామకాల వల్ల వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయని, తద్వారా పోలీసులలో విధి నిర్వహణ పరమైన నిరాసక్తత ఏర్పడుతున్నదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ విధానాన్ని మార్చి పోలీసుశాఖలో ఒకే రకమైన రిక్రూట్‌మెంట్ పాలసీని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విషయమై వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయించింది. తమిళనాడు, హర్యానాల్లో అదనపు డీజీ ఉమేష్‌షరాఫ్, ఐజీ బాలనాగాదేవి, ఎస్పీ రవీందర్‌లతో కూడిన కమిటీ అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే అక్కడ కూడా గతంలో కానిస్టేబుళ్లను సాయుధ పటాలంలోకి మొదట రిక్రూట్మెంట్ చేసి తర్వాత వారిని సివిల్ పోలీసు విభాగంలో ఏర్పడే ఖాళీల్లోకి బదిలీ చేసేవారు. అయితే, ఈ విధానం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మళ్లీ పాత విధానం ఏఆర్, సాయుధ పోలీసు పటాలం,సివిల్ పోలీసు విభాగాలకు వేర్వేరుగా నియామకాలు చేస్తున్నారని అధికారులు తమ నివేదికలో వివరించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే విధానంలో కానిస్టేబుళ్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. ఈ నియామకాల్లో ఏవైనా మార్పులు జరపాలనుకుంటే.. విస్తృత స్థాయిలో చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఖాకీ యూనిఫాం స్థానంలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించేలా యుఎన్ లేదా న్యూయార్క్, స్కాట్‌లాండ్ పోలీస్ మాదిరిగా యూనిఫాంలో మార్పులు తీసుకురావాలని సాగుతున్న యోచనలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని సమాచారం. దీనిపై కూడా మరింతగా చర్చలు జరిపాకే తుది నిర్ణయానికి రావాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా యూనిఫాంను మార్చేకంటే.. ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల్ని సానుభూతితో పరిష్కరించేలా పోలీసుల్లో గుణాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు మాజీ పోలీసు అధికారులు సూచించినట్లు సమాచారం.