
హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం వద్దు..
హన్మకొండ సిటీ : హైదరాబాద్ పాలనకు సంబంధించి గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలనే ఆలోచనను కేంద్రప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సూచించారు. హన్మకొండలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఉద్యోగుల నియామకం, పాలనకు సంబంధించి ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రూ.లక్షల కోట్ల విలువైన భూములు సీమాంధ్ర పెట్టుబడిదారుల కబ్జాలో ఉన్నాయని, వీటిని కాపాడుకోవడానికే గవర్నర్ పెత్తనం కుట్రను తెరపైకి తీసుకువచ్చారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి రాసిన లేఖపై తెలంగాణ ప్రాంత నాయకులు స్పందించాలని పాపిరెడ్డి డిమాండ్ చేశారు.
మరో ఉద్యమానికి సిద్ధం
హైదరాబాద్‌ను గవర్నర్ పాలన కిందకు తీసుకువస్తే మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని టీజేఏసీ జిల్లా కన్వీనర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్ తెలిపారు. ఉద్యమాలు తెలంగాణ ప్రజలకేమీ కొత్త కాదన్నారు. హైదరాబాద్‌ను గవర్నర్ పాలన కిందకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించొద్దని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, బీజేపీ నాయకుడు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నేత నున్నా అప్పారావు, జేఏసీ నాయకులు ఎ.జగన్మోహన్‌రావు, ప్రొఫెసర్ సీతారామారావు, సాదు రాజేష్, రత్నాకర్‌రెడ్డి, సోమయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.