'హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాలు గవర్నర్‌కే ఇవ్వాలి'
ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలు మొత్తం గవర్నర్‌కు ఉండేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే చట్టాన్ని మార్చి అయినా గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిల్లో నివాసముంటున్న ప్రజలకు భద్రత, ఆస్తులకు రక్షణ చర్యల విషయంలో కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు కమిషనర్లతో సహా, డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారుల నియామకం మొత్తం గవర్నర్ పరిధిలోకి తేవాలన్నారు. రెండు రోజుల కిందట చంద్రబాబు రాసిన ఈ లేఖ ప్రస్తుతం వివాదానికి దారితీసేదిగా మారింది. ఆదివారం రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఈ లేఖ విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు.
‘ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ మొత్తం గవర్నర్ పరిధిలోనే కొనసాగాలి. ఇక్కడి పోలీసు వ్యవస్థ మొత్తం గవర్నర్ పర్యవేక్షణలోనే ఉండాలి. విభజన చట్టంలో దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో పోలీసు నియామకాలు, బదిలీలు కూడా గవర్నర్ పరిధిలో ఉండాలి. ఇక్కడి శాంతిభద్రతల వ్యవహారం ఉమ్మడి ప్రభుత్వాలకు సంబంధించిన పోలీసు అధికారుల బాధ్యతగా చేయాలి. నియామకాలు, బదిలీలు, భవనాల కేటాయింపు, వాటి పరిరక్షణ, నిర్వహణ బాధ్యతల్లో రెండు ప్రభుత్వాలకూ సమానాధికారాలు ఉండాలి. విభజన చట్టంలో ఈ అంశాలన్నీ స్పష్టంగా ఉన్నాయి’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజల మానప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారని తెలుస్తోంది.