
రాయడం రాదు.. చదవ డం రాదు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ మసకబారుతోంది. ఏటా వారంతా తరగతుల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పటికీ.. సామర్థ్యం మాత్రం క్రమంగా పతనమవుతోంది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 3.25లక్షలు
విశ్లేషణకు తీసుకున్న విద్యార్థుల సంఖ్య: 1.61లక్షలు
తెలుగు చదవలేని వారు: 75 శాతం
తెలుగు రాయలేని వారు: 77శాతం
చతుర్విధ ప్రక్రియలో విఫలం: 85శాతం
రంగారెడ్డి జిల్లా :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ మసకబారుతోంది. ఏటా వారంతా తరగతుల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పటికీ.. సామర్థ్యం మాత్రం క్రమంగా పతనమవుతోంది. చదవడం, రాయడంతోపాటు చతుర్విధ ప్రక్రియల్లో విద్యార్థి సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ఫలితాలను చూసిన విద్యాశాఖ అధికారులకు దిమ్మతిరిగింది. మెజారిటీ సంఖ్యలో విద్యార్థులు తెలుగు పదాలను సైతం చదవలేకపోతున్నారు. రాయడంలోనూ బాగా వెనకబడ్డారు. అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడంవంటి చతుర్విత ప్రక్రియల్లో ఏకంగా 85శాతం మంది విద్యార్థులు విఫలమవ్వడం గమనార్హం.
జిల్లాలో 2,316 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 1,639, ప్రాథమికోన్నత పాఠశాలలు 259, ఉన్నత పాఠశాలలు 418 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 3.25లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు చతుర్విధ ప్రక్రియల్లో కనీస సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ‘ట్రిపుల్ ఆర్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతేడాది నవంబర్ 14వతేదీలోగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా చర్యలకు దిగిన ఉపాధ్యాయగణం.. అమలులో ఘోరంగా విఫలమైంది. 75శాతం విద్యార్థులు తెలుగు చదవలేకపోతుండగా.. 77శాతం మంది రాయలేకపోతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.