
‘ఆసరా’ లేదని దిగులు చెందవద్దు
సిద్దిపేట జోన్: పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగినా పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రక్రియను మళ్లీ ప్రారంభించామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసరా పథకం కింద పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో నిర్వహించిన సభల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ ప్రక్రియ గత నెలలోనే నిర్వహించాల్సి ఉందన్నారు. అర్హులందరికి ఆసరా వర్తింపజేసే విషయంలో జాప్యం జరిగినా నెల రోజుల పాటు విస్తృతంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టామన్నారు.
ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని, జాబితాలో అర్హులు తమ పేరు లేదంటూ దిగులు చెందవద్దన్నారు. అవసరమైతే వారి దరఖాస్తులను మళ్లీ పరిశీలించి పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పథకం కింద 20 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ. 4 వేల కోట్లను కేటాయించిందని, మరోవైపు ప్రతి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. జనవరి నెలలో బియ్యం కోటాను 6 కిలోలకు పెంచుతూ కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా రేషన్ బియ్యాన్ని అందిస్తామన్నారు.
ఇందు కోసం రూ. 3 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద వర్గాల సంక్షేమానికి మొత్తంగా రూ. 7 వేల కోట్లతో బియ్యం, పింఛన్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట ప్రాంతాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు రైల్వే లైన్‌ను సాధ్యమైనంత త్వరలో సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, మున్సిపల్ మేనేజర్ నరేందర్, టీఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, నయ్యర్, మల్లికార్జున్, షఫీకూర్ రహమాన్, సాయిరాం, కనకరాజు, సంపత్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, శేషుకుమార్, శ్రీనివాస్‌గౌడ్, రవితేజ, ప్రభాకర్ పాల్గొన్నారు.
లారీ డ్రైవర్లకు బీమా
-మంత్రి హామీ
సంగారెడ్డి అర్బన్: లారీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయడానికి తన వంతు కృషి చేస్తానని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సంగారెడ్డిలో తెలంగాణ లారీ ఓనర్స్, డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు అధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉండబోవన్నారు. డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నిరుపేద లారీ కార్మికులకు సొంత స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ లారీ కార్మికుల జీవితం ప్రమాదంతో కూడుకున్నదని, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లారీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాసిత్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి మురళీయాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌చారి, జలాలుద్దిన్ బాబా, లియాఖత్, అసోషియేషన్ నాయకులు నయీమొద్దీన్ ఎజాస్‌పాష, అబూబాకత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.