
మద్యం దుకాణాలు మాకొద్దు...
‘మద్యం దుకాణాలు మాకొద్దు’ అంటూ గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తే...ఆ షాపులను నోటిఫికేషన్ నుంచి తొలగించాలని హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, ఖమ్మం:‘మద్యం దుకాణాలు మాకొద్దు’ అంటూ గ్రామ సభల్లో తీర్మానాలు చేస్తే...ఆ షాపులను నోటిఫికేషన్ నుంచి తొలగించాలని హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామసభలు వద్దని తీర్మానం చేసినా అవేవీ పట్టించుకోకుండా జిల్లా ఎక్సైజ్‌శాఖ సంబంధిత దుకాణాలకు టెండర్లు నిర్వహించిందని జిల్లాకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు శనివారం మధ్యంతర ఉత్తుర్వులు ఇచ్చారు.
జిల్లాలో ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు ఎక్సైజ్‌శాఖ నూతన మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించింది. దీనిలో ఏజెన్సీ పరిధిలో 57 దుకాణాలు ఉన్నాయి. ఈ షాపులు పొందాలంటే ఆయా గ్రామ సభల తీర్మానం తప్పని సరి అని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. తీర్మానం అయిన దుకాణాలకే ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించాలి. అయితే ఏజెన్సీలోని 18 దుకాణాలు ‘తమకు వద్దూ’ అంటూ గ్రామ సభలు తీర్మానం చేశాయి. అయినా వీటికి కూడా నోటిఫికేషన్ వెలువరించి టెండర్లను ఆహ్వానించి, డ్రా కూడా తీశారు. ఈ దుకాణాలకు గ్రామ సభల ఆమోదం లేకున్నా అధికారులు టెండర్లు నిర్వహించారని ఏజెన్సీకి చెందిన కొంతమంది హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఈ దుకాణాలను ఈనెల 14న ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి తొలగించాలని, ప్రస్తుతానికి వీటికి లెసైన్స్‌లు జారీ చేయవద్దని జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ కొత్తగూడెం సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి ఈ విషయమై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఈ దుకాణాల విషయంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి తీరుతామని డెప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు.