- పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నా..
- తెలంగాణ ద్రోహి చంద్రబాబు
- సిగ్గులేకుండా బీజేపీ అధిష్టానం వద్ద మోకరిల్లాడు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
కేసముద్రం, న్యూస్‌లైన్ : సమైక్యవాద టీడీపీతో తమ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని... ఇందుకు నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి చంద్రబాబు బీజేపీ హైకమాండ్ వద్ద మోకరిల్లి సిగ్గులేకుండా పొత్తుకుదుర్చుకున్నాడని విమర్శించారు.
తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే చచ్చిపోయిన టీడీపీని కాస్త బతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాడని, తమ పార్టీ నేత వెంకయ్యనాయుడుతో ఈ పొత్తును ఖరారు చేయించుకున్నాడని మండిపడ్డారు. టీడీపీతో ఎన్నికల్లోకి పోతే బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. ఒకప్పుడు మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో తాము పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పుచేశానన్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఏ తప్పు చేసి పొత్తుపెట్టుకున్నాడని ప్రశ్నించారు.
ఎన్నోమార్లు తాము పార్టీ అధిష్టానం వద్ద పొత్తువద్దని, సమైక్యవాద పార్టీతో పొత్తుపెట్టుకుంటే నష్టపోతామని చెప్పినా.. చివరకు పొత్తుపెట్టుకోవడం తనను మనస్థాపానికి గురిచేసిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని, కనీసం పార్టీ నుంచి పావులా బిళ్ల కూడా ఇవ్వనప్పటికీ ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి స్వతహాగా ఖర్చుపెట్టుకుని తమ కార్యకర్తలు,నాయకులు పని చేశారని, అలాంటిది తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం బాధించిందన్నారు. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేసి.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ప్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం నిజం తెలుసుకోవాలని కోరారు.
ఆయనతో పాటు రాష్ట్ర కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లబు వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భుక్యా బాలునాయక్, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు కందునూరి నగేష్‌గౌడ్ తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు.