గ్రేటర్ పరిధిలోని తొమ్మిది బస్తీల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ..
రూ.150 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని తొమ్మిది బస్తీల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ.. టెండర్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా నగరంలో 46 బస్తీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించినప్పటికీ.. పలు కారణాల రీత్యా ఈ బస్తీల సంఖ్యను 30కి కుదించారు. గ్రేటర్‌లో లక్ష ఇళ్ల నిర్మాణంలో భాగంగా సత్వరమే 9 బస్తీల్లో 2,158 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించటానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సయ్యర్ సాహాబ్ బాడలో జీ ప్లస్ త్రీ భవనాలు(అంతస్తులు), పిల్లిగుడిసెలు, సరళాదేవినగర్, కామ్‌గారి నగర్, లంబాడీ తండా, హమాలీ బస్తీ, చిలుకలగూడ, ఇందిరానగర్, జంగంమెట్ బస్తీల్లో జీప్లస్ 9 భవనాల(అంతస్తులు)లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడానికి సత్వరమే టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
అలాగే మహబూబ్‌నగర్‌లోని ఒక ప్రాంతంలో 2,300 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, మెదక్‌లో తొమ్మిది ప్రాంతాల్లో 6,385 ఇళ్లు, నిజామాబాద్‌లో తొమ్మిది ప్రాంతాల్లో 6,245 ఇళ్లు, ఆదిలాబాద్‌లోని ఒక ప్రాంతంలో 218 ఇళ్లు, కరీంనగర్‌లో 14 చోట్ల 5,447 ఇళ్లు, ఖమ్మంలో రెండు చోట్ల 2,022 ఇళ్లు, వరంగల్‌లో మూడు ప్రాంతాల్లో 1,784 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడానికి టెండర్ల కోసం పరిపాలన అనుమతులు మంజూరీ ఇస్తూ... ఆయా జిల్లాల గృహ నిర్మాణ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.