అందుబాటు ధరల్లో ఔషధాలు
- ఫార్మా సదస్సులో నిపుణుల సూచన
- నూతన ఔషధాలపై విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చౌకధరల్లో ఔషధాలు అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ ఫార్మా సదస్సులో నిఫుణులు అభిప్రాయపడ్డారు. ఔషధ ప్రయోగాల్లో నూతన సాంకేతిక వైద్య పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం 66వ ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ సదస్సు రెండో రోజు కొనసాగింది. ఈ సదస్సులో నూతన ఔషదాలు, అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన పరిశోధన ఫలితాలు వంటి అంశాలపై చర్చించారు.
ఫార్మా రంగంలో వస్తున్న మార్పులు, కొత్త ఆవిష్కరణలపై ప్రముఖులు విసృ్తతంగా చర్చలు జరిపారు. ఆదివారం కూడా కొనసాగే ఈ సదస్సులో దేశంలోని ప్రముఖ ఫార్మా రంగ నిఫుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. అంతర్జాతీయ అనుభవాలను పంచుకునేందుకు బ్రిటన్, నైజీరియా, హంగరీ, ఫ్రాన్స్, కాంబోడియా, జాంబియా, రుమానియా, మాల్దొవా తదితర దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ప్రొఫెసర్లు, ఫార్మా ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగాలు చేయగా.. ఫార్మసీ విద్యార్థులు పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్లలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫార్మా ఎక్స్‌పో, ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అధునాతన ఔషధ పరికరాలు, వివిధ రకాల మెషిన్లను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.