బుర్కనకోట(చింతూరు), న్యూస్‌లైన్: ఎన్నికల వేళ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీలో వారం వ్యవధిలో చింతూరు మండలంలో రెండు ఘటనలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ నెల 10వ తేదీన మండలంలోని తుమ్మల గ్రామంలో సీపీఎం నాయకుడు పట్రా ముత్యంను హతమార్చారు. ఆ ఘటన నుంచి పోలీసులు తేరుకోకముందే తాజాగా బుర్కనకోట గ్రామంలో శనివారం రాత్రి రహదారి నిర్మాణం కోసం నిల్వ ఉంచిన 55 తారు డ్రమ్ములను పగులగొట్టి తారును పారబోశారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల వైపు నుంచి సుమారు 100 మంది మావోయిస్టులు రెండు బృందాలుగా వచ్చారు. వీరిలో కొందరు రహదారికి రెండు వైపులా కాపలా ఉండగా, మరికొందరు తారు నిల్వ చేసి ప్రాంతానికి చేరుకున్నారు. గొడ్డళ్లతో డ్రమ్ములు పగులగొట్టి తారు పారబోశారు. తారుకు నిప్పంటించి దగ్ధం చేసి ప్రయత్నం చేశారు. వచ్చిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారని, డ్రమ్ములు పగలగొట్టింది మహిళలేనని గ్రామస్తులు తెలిపారు. అనంతరం మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల వైపునకు వెళ్లిపోయారని గ్రామస్తులు చెప్పారు. వరుస ఘటనలతో తమ ఉనికి చాటుతూ ఎన్నికలపై ప్రభావం చూపేవిధంగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఇక్కడ రహదారి నిర్మాణం చేపడుతున్న ఓ ప్రొక్లెయిన్‌ను మావోయిస్టులు దగ్ధం చేశారు. తాజాగా జరిగిన ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన జరిగిన ప్రాంతం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఉంది. ఈ ఘటనలో సుమారు 3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం.
నిర్మాణంలో జాప్యం
భద్రాచలం, చట్టి జాతీయ రహదారి నుంచి పీఎంజీఎస్‌వై కింద రూ.కోటి 37 లక్షలతో బుర్కనకోటకు 4 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణాన్ని అడ్డుకునేందుకే మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2010లో ప్రారంభమైన ఈ రహదారి పనులు 2012 మార్చి వరకు పూర్తి కావాల్సి ఉంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అటవీసిబ్బంది అడ్డుకోవడం తదితర కారణాలతో ఇంకా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. అటవీ అధికారులు అడ్డుకోవడంతో రహదారి నిర్మాణం నిలిచిపోగా తామంతా వెళ్లి అటవీ అధికారులతో మాట్లాడితే అనుమతులిచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 15 రోజుల క్రితం కాంట్రాక్టరు తారు డ్రమ్ములను తీసుకువచ్చి గ్రామంలో నిల్వ చేశారని, ఇంతలోనే మావోయిస్టులు వాటిని ధ్వంసం చేశారని గ్రామస్తులు తెలిపారు.
మిలీషియా సభ్యుల పనే: అమృతరెడ్డి, సీఐ, చింతూరు
రహదారి నిర్మాణాన్ని అడ్డుకునేందుకే మావోయిస్టులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మిలీషియా సభ్యులు పాల్గొన్నట్లు తెలిసింది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ మాకు ఎలాంటి సమాచారమివ్వలేదు.
బుర్కనకోటలో మావోయిస్టుల హల్‌చల్
Published Mon, Mar 17 2014 2:06 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement