సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదల విషయంలో ఆర్థికశాఖ తీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విస్మయానికి గురైంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 150 కోట్లు విడుదల చేయాల్సిందిగా సీఈవో కార్యాలయం ఆర్థికశాఖను కోరింది. స్పందించిన ఆర్థికశాఖ శుక్రవారం రూ. 150 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధులను ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పంపిణీ చేసింది. తీరా నిధుల కోసం శనివారం ట్రెజరీలకు బిల్లులు సమర్పించటానికి వెళితే.. నిధుల విడుదలపై ఫ్రీజింగ్ విధించారని, బిల్లులను తీసుకోబోమని ట్రెజరీ అధికారులు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మళ్లీ ఆర్థికశాఖను ఆశ్రయించింది. ఎన్నికల నిధులకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఎటువంటి ఆంక్షలు విధించరాదని, ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.
ఎన్నికల నిర్వహణకు రూ. 850 కోట్లు...
ఇదిలావుంటే.. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ. 850 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థికశాఖకు పంపింది. ఈ రూ. 850 కోట్లలో సగం నిధులను కేంద్ర ప్రభుత్వం మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 2009లో నిర్వహించిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు రూ. 450 కోట్ల వ్యయం అయింది. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఇప్పటి ఎన్నికలకు వ్యయం దాదాపు రెట్టింపు అవటం గమనార్హం.
ఎన్నికల నిధులపై ఆంక్షలు
Published Sun, Mar 16 2014 2:02 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement