
ప్రజా ఎన్నికల విధానం అమలు
ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యముంటుందని, రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలందరి సహకారంతో...
‘సాక్షి’తో రాష్ర్ట తొలి ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యముంటుందని, రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలందరి సహకారంతో వాటిని సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టినసీనియర్ ఐఏఎస్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఇది తనకు దక్కిన అదృష్టమని, ప్రజలు కోరుకున్న విధంగా సేవలందిస్తానని ఆయన ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఎంతో కీలకమైంది.
అందుకే నాపై ఎంతో గురుతర బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకున్న విధంగా.. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా ఎన్నికలు జరిపేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని నాగిరెడ్డి తెలిపారు. రాబోయే జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలను అందరి సహకారంతో సమర్థంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను ఇప్పటివరకు నిర్వహించడంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.
మెదక్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సబ్ కలెక్టర్ మొదలు వివిధ హోదాల్లో పని చేశారు. గతంలో కడప, విజయనగరం జిల్లాల కలెక్టర్‌గా ఉన్నారు. విధి నిర్వహణలో సౌమ్యునిగా, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో చురుకైన అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఏడాది నవంబర్ 11న నాగిరెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. కానీ ఎన్నికల కమిషనర్‌గా పని చేసేందుకు ప్రభుత్వ సర్వీసులో ఉండకూడదనే నిబంధన ఉండటంతో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యమైంది.
నాగిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. రెండ్రోజుల కిందట జరిగిన ఐఏఎస్‌ల బదిలీల సందర్భంగా ప్రభుత్వం ఆయనను ఆర్థిక శాఖ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. సర్వీస్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఎన్నికల కమిషనర్‌గా ఆయన ఐదేళ్ల పాటు సేవలందించనున్నారు.