ఏళ్లకేళ్లుగా అవస్థలే..
‘డ్రెయినేజీల నీళ్లు నిండిపోతే వాసన భరించలేక పోతున్నం. దోమలు ఎక్కువైపోయి నిద్ర కూడా పడుతలేదు. మురుగు కంపుతోటి సచ్చిపోతున్నం. డ్రెయినేజీ కోసం కట్టిన కాల్వల నుంచే మంచినీళ్ల పైపులైన్లు వేసిండ్లు. పైపులు లీకైనప్పుడల్లా ఆ నీళ్లు మంచి నీళ్లలో కలుస్తున్నయ్. మురికి కాల్వలు కూడా తక్కువ వెడల్పుతో కట్టడంతో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ముందుకు వెళ్లక ఇళ్లలోకి వస్తున్నయ్.
ఎంతకని చెప్పుడు! పదేండ్ల నుంచి మాది ఇదే గోస. సింగరేణికి చెందిన నీళ్ల ట్యాంకు కాడ చెత్తపోత్తండ్లు. మేం పేదోళ్లం. ఏం చేయలేక ఈ మురికి కూపంలోనే బతుకుతున్నం’ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజల ఆవేదన ఇది...
కొంకటి లక్ష్మీనారాయణ : అమ్మా నమస్కారములు. ఎలా ఉన్నారమ్మా?
లక్ష్మీకాంతం : ఎలా ఉంటాం సారూ. మురుగు కంపుతోటి సచ్చిపోతున్నం. డ్రెరుునేజీ కుండీలు కట్టినట్టేకానీ.. ఏం పాయిదా లేదు. కుండీలు నిండిపోయి మురికినీళ్లన్నీ ఇండ్లల్లకత్తన్నయ్. రోగాలపాలైతన్నం.
లక్ష్మీనారాయణ : మీరు చెప్పండమ్మా..?
సరస్వతీ : డ్రెయినేజీల నీళ్లు నిండిపోతే వాసన భరించలేక పోతున్నం. ఇంటికి తలా కొంత డబ్బు పోగేసి కుండీలళ్ల జామైన మట్టిని తీపిచ్చుకుంటున్నం. ఎవలకు చెప్పినా పట్టించుకుంటలేరు. మా గోసైతే తీరుతలేదు.
లక్ష్మీనారాయణ : కార్పొరేషన్ నల్లాలున్నాయా?
సుశీల : కార్పొరేషన్ పైపులైన్లు ఉన్నా... సంవత్సరం నుంచి నీళ్లు వస్తలేవు. పక్కింటికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నం.
లక్ష్మీనారాయణ : మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తా.
లక్ష్మీనారాయణ : ఎలా ఉన్నారండి..? మే పేరేంటి?
రవీందర్ : నా పేరు రవీందర్. ఆటో డ్రైవర్‌ను.
లక్ష్మీనారాయణ : మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా?
రవీందర్ : మా ఇంటి ముందు కరెంటు తీగలు కిందకి వేలాడుతున్నయ్. ట్రాక్టర్ రావాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రమాదముందని అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు.
లక్ష్మీనారాయణ : ఏమమ్మా.. బాగున్నారా..?
లక్ష్మి : ఏం బాగుంటాం సార్. ఇంటి ముందట మురుగునీళ్ల కోసం కుండీలను కట్టిళ్లు. దానిమీద మూతలే పెట్టలేదు. దోమలు ఎక్కువైపోయి నిద్ర కూడా పడుతలేదు. ఇంట్లో అందరం ఇబ్బంది పడుతన్నం.
లక్ష్మీనారాయణ : ఎలా ఉన్నారు..? మీకేమైనా సమస్యలున్నాయా..?
పూర్మ శ్రీనివాస్ : నేను న్యాయవాదిగా పనిచేస్తున్నా. ఈ ప్రాంతం మున్సిపాలిటీకాకముందు నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుతం అన్‌ఆథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్(యూఏసీ) కింద ఆస్తి విలువలో 10 శాతం ఎక్కువ పన్ను విధిస్తున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించారు. మేం ఎందుకు ఈ అదనపు పన్ను చెల్లించాలి.
లక్ష్మీనారాయణ : అధికారుల దృష్టికి తీసుకెళ్తా.
లక్ష్మీనారాయణ : ఏం తాత.. బాగున్నావా..?
బాలయ్య : ఏం బాగుంటామయ్యా. ఇరువై ఏండ్ల కిందట సింగరేణిలో పనిచేసి రిటేరైన. వయసు మీదపడి వచ్చిన రోగాలకు సింగరేణి ఆస్పత్రికిపోతే మందులిత్తలేరు. గవర్నమెంట్ ఆస్పత్రికి పోదామంటే ఆటో చార్జీలకే యాభై రూపాయలైతన్నయ్. అందుకే ఇంటికాన్నే ఉంటన్న. సింగరేణిల పింఛన్ వత్తలేదు. కేసీఆర్ వచ్చినంక ఇత్తమన్నరు. ఇంకా ఇత్తలేరు. జల్ది ఇప్పియ్యండ్రి.
లక్ష్మీనారాయణ : పింఛన్ కోసం కార్పొరేషన్‌లో దరఖాస్తు పెట్టుకున్నవా..? పెట్టుకోకుంటే ఎవరితోనైనా దరఖాస్తు రాపిచ్చి ఇయ్యి. నేను పింఛన్ ఇప్పిస్తా.
ఆనందం : సార్... నీళ్ల పైపులు లీకైతన్నయ్. ఆ నీళ్లనే తాగుతన్నం.
లక్ష్మీనారాయణ : తాగునీటి పైపులైన్ల లీకేజీలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా.
లక్ష్మీనారాయణ : ఏం అన్నా... బాగున్నావా. మీ ఏరియాలో ఏమైనా సమస్యలున్నాయా..?
మామిడి లింగయ్య : ఇంటిముందటున్న సింగరేణికి చెందిన నీళ్ల ట్యాంకు కాడ చెత్తపోత్తండ్లు. కుళ్లిపోయినై తీసుకొచ్చి అక్కడేత్తండ్లు. వాసనతో సచ్చిపోతున్నం. ఇంకేం బాగుంటం.
లక్ష్మీనారాయణ : రోజూ వచ్చి చెత్తతీత్తలేరా..?
మామిడి లింగయ్య : వారం రోజులకొక్కసారి కూడా చెత్త తీత్తలేరు. ఎన్నిసార్లు చెప్పినా ఎవలు పట్టించుకుంటలేరు.
లక్ష్మీనారాయణ:ఈ ఇండ్లల్ల ఎట్ల ఉంటున్నరమ్మా
మధునమ్మ : మా బతుకు ఏం చెప్పుడు సారూ. ఎంతకని చెప్పుడు! పదేండ్ల నుంచి మాది ఇదే గోస. ఇంతకుముందు మురుగునీరు, వాన నీ ళ్లు సాపుగా ఎల్లిపోయేటివి. కాల్వకు మధ్య సెప్టిక్‌ట్యాంక్ కట్టి మమ్మల్ని అరిగోస పెట్టిళ్లు. రోజూ నరకమే చూస్తున్నం. చుట్టుపక్కల ఇండ్ల ల్ల నుంచి వచ్చిన డ్రెయినేజీ నీళ్లన్నీ ఇండ్ల పక్కకే వత్తున్నయ్. నీళ్లు ఎక్కువైతే ఇంట్లోకి వస్తయి. వాన కాలంల మురికినీళ్లతో ఇండ్లన్నీ నిండిపోతయ్. దోమలబాధ భరించలేపోతున్నం. రోగాలకే పైసలన్నీ ఖర్చయితన్నయ్. అసలు నిద్ర కూడా పడుతలేదు. ఇల్లు ఖాళీ చేసి వేరే కాడ కిరాయికి ఉంటే బాగుండు అనిపిస్తంది.
లక్ష్మీనారాయణ : మీరు చెప్పండమ్మా..?
శిరీష : సార్... మేం పేదోళ్లం. ఏం చేయలేక ఈ మురికి కూపంలోనే బతుకుతున్నం. వానకాలంల ఇళ్లలోకి వచ్చిన నీళ్లను బయటకు పంపించాలంటే మా తరం అయితలేదు. ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎందరో లీడర్లు వచ్చి చూసిం డ్రు. పరిష్కరిస్తామని చెప్పి పోయిండ్రు. వాళ్లు వచ్చుడు... పోవుడు వరకే కానీ, మా సమస్య మాత్రం తీరలేదు. మా బాధను ‘సాక్షి’ పేపర్ గతంలో చాలా సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చింది. (‘సాక్షి’ ప్రచురించిన కథనాలను కొంకటి లక్ష్మీనారాయణకు చూపించారు.)
కనకలక్ష్మి : మేమీ ప్రాంతంలో ఉంటున్నామనే విషయాన్ని కూడా అధికారులు గుర్తిస్తలేరు. అందరిలెక్కనే పన్నులు కడుతున్నం. మమ్మలెందుకు ఈ రకంగా ఇబ్బందిపెడుతున్నారు.
శ్రీనివాస్ : డ్రెయినేజీ కోసం కట్టిన కాల్వల నుంచే మంచినీళ్ల పైపులైన్లు వేసిండ్లు. పైపులు లీకైనప్పుడల్లా ఆ నీళ్లు మంచినీళ్లలో కలుస్తున్నయ్. మురికి కాల్వలు కూడా తక్కువ వెడల్పుతో కట్టడంతో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ముందుకు వెళ్లక ఇళ్లలోకి వస్తున్నయ్. కాల్వ వెడల్పు చేయాలె.
లక్ష్మీనారాయణ : అమ్మా బాగున్నారా..?
భాగ్య : నమస్కారం సార్. రమేశ్‌నగర్ చౌరస్తా ఇవతల రోడ్డు అధ్వానంగా తయారైంది. వాహనాలు నడిరోడ్డు నుంచి వెళ్లకుండా పక్కనుంచి వస్తుండడంతో పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నరు.
లక్ష్మీనారాయణ : రోడ్డు మీద నీళ్లు చాలానే పారుతున్నయ్ కదా?
సరోజన : కార్పొరేషన్ మంచినీటి పైప్‌లైన్ లీకై ఇలా రోడ్డు మీద మొత్తం నీళ్లే సార్. నీళ్లు నిలిచి రోడ్డు కూడా పాడైపోయింది. పంపు వచ్చినప్పుడల్లా ఇదే గోస. ఎవలు పట్టించుకుంటలేరు.
మేయర్ హామీలు...
ఎల్‌బీనగర్‌లో అండర్‌గ్రౌండ్ పైపులైన్ సరిగ్గా వేయకపోవడంతో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. దీన్ని సరిచేసేందుకు కార్పొరేషన్ అధికారులతో అంచనాలు తయారు చేయిస్తున్నా. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
కిందికి వేలాడే విద్యుత్ తీగల విషయమై వెంటనే ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడుతా. లూజ్‌లైన్లు లేకుండా చూస్తాం.
సింగరేణిలో పనిచేసి 20 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సంస్థ నుంచి పెన్షన్ రావడం లేదు. వారికి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా. రూ.2 లక్షల్లోపు ఆదాయం ఉన్న వృద్ధులకు పెన్షన్ తప్పకుండా ఇస్తాం.
మేం అధికారంలోకి రాకముందు 295 చోట్ల తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలుండేవి. అధికారంలోకి వచ్చాక 230 లీకేజీలు అరికట్టాం. లీకేజీలు శాశ్వతంగా అరికట్టేందుకు రూ.2.20 కోట్లతో టెండర్లు పిలిచాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
24వ డివిజన్‌లో ఇళ్ల మధ్య ఉన్న మురికి గుంటను తొలగించి అక్కడ కాల్వ నిర్మిస్తాం.
రీజినల్ ఆస్పత్రి రోడ్డు నుంచి ఎల్‌బీనగర్‌కు వెళ్లే రహదారి సింగరేణికి సంబంధించింది. ఈ రోడ్డును నిర్మించాలని సింగరేణికి లేఖ రాస్తాం.