హాల్‌టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
* నిప్పంటించుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి
* 90 శాతం గాయాలతో పరిస్థితి విషమం
* ఇంటర్ సర్టిఫికెట్‌కు గుర్తింపు లేకపోవడమే కారణం
* అడ్మిషన్ సమయంలో పట్టించుకోని కళాశాల
* పరీక్షల సమయంలో హాల్‌టికెట్ జారీ చేయని ఉన్నత విద్యామండలి
* కాలేజీ నిర్వాకంపై తోటి విద్యార్థుల ఆగ్రహం
మొయినాబాద్: హాల్‌టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్టిఫికెట్లు సరిగా తనిఖీ చేయకుండా అడ్మిషన్ ఇచ్చిన కాలే జీ యాజమాన్యం.. తీరా పరీక్షల సమయంలో హాల్‌టికెట్ రాలేదని చేతులె త్తేయడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో గాయత్రి ఆలయ సమీపంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన కె.శివమహేష్(21).. గతేడాది తొలుత విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివినట్లు సర్టిఫికెట్‌ను ఇంజనీరింగ్ కాలేజీలో మహేశ్ సమర్పించాడు. అయితే ఆ కాలేజీకి గుర్తింపు లేదని, ఇంటర్ సర్టిఫికెట్ చెల్లద సిబ్బంది ఇంజనీరింగ్ అడ్మిషన్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా హిమాయత్‌నగర్‌లో ఉన్న అభినవ్ హైటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ గ్రూపులో శివమహేశ్ చేరాడు. సదరు కళాశాల యాజమాన్యం అతడి సర్టిఫికెట్లను తనిఖీ చేయకుండానే కాసులకు కక్కుర్తి పడి అడ్మిషన్ ఇచ్చింది. ఆరు నెలలుగా కళాశాలకు వెళ్తున్న మహేశ్.. మొదటి సంవత్సరం పరీక్షకు ఫీజు సైతం చెల్లించాడు. అయితే హాల్‌టికెట్ల జారీ కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను తనిఖీ కోసం ఉన్నత విద్యామండలికి కళాశాల యాజమాన్యం పంపించింది.
మహేశ్ ఇంటర్ చదివిన కాలేజీకి ప్రభుత్వ గుర్తింపు లేదని, హాల్‌టికెట్ జారీ చేయడం లేదని ఉన్నత విద్యామండలి తెలియజేసింది. దీంతో ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం ఈ నెల 12న శివమహేశ్‌కు తెలిపింది. సోమవారం నుంచి మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం కావడం.. పరీక్షకు హాల్‌టికెట్ రాకపోవడంతో శివమహేశ్ తీవ్రంగా మనస్తాపం చెందాడు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని గాయత్రి ఆలయం సమీపంలోని నిర్మాణుష్య ప్రదేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని ఓ ఇంటి వాచ్‌మన్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తీవ్రంగా గాయపడిన శివమహేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. శివమహేశ్‌ను చేర్చుకునే సమయంలోనే కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లను క్షణంగా తనిఖీ చేయాల్సింది. అప్పుడే ఇంటర్ సర్టిఫికెట్ చెల్లదని గుర్తించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చేరి 6 నెలలుగా తరగతులకు హాజరై తీరా పరీక్షల సమయంలో హాల్ టికెట్ రాకపోవడంతో శివమహేశ్ మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు.