జోరు లేని కారు
టీఆర్‌ఎస్‌లో వీడని స్తబ్దత
కాంగ్రెస్‌లో పెరిగిన హడావుడి
కార్యాచరణలో ప్రతిపక్ష పార్టీలు
ముంచుకొస్తున్న వరంగల్ ఉప ఎన్నిక
వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. బీహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. అక్టోబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని... దీనికి 45 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ప్రక్రియలో భాగంగా తాజాగా తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలూ కార్యాచరణ ముమ్మరం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంది. బీజేపీ, టీడీపీ ఇదే స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యి. వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యాచరణ మొదలుపెట్టాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మాత్రం ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టడంలేదు. టీఆర్‌ఎస్ పార్టీలో 4 నెలలుగా స్తబ్దత నెల కొంది. పార్టీ కార్యక్రమాలు అనేవే జరగడంలేదు. అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్న వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఆ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల్లో కదలిక కనిపించడంలేదు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి అన్ని నిర్ణయాలు అధినేత కేసీఆర్ చేతుల్లోనే ఉన్నా... ఎన్నికల విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది.
టీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు తప్పితే.. మిగిలిన వారు ఈ విషయంపై చర్చ కూడా జరపడంలేదు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్‌ఎస్‌లో పూర్తిగా స్తబ్దత నెలకొంది. ఉపఎన్నిక విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పీసీసీ చీఫ్ వంటి నేతలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మూడు వారాలకు ఓ సారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, డి.శ్రీధర్‌బాబు వంటి నేతలు నియోజకర్గాల బాధ్యతలను తీసుకున్నారు. జిల్లా నేతలు వీరికి అనుబంధంగా పనిచేస్తున్నారు. సమావేశాలు నిర్వహించడం బాగానే ఉన్నా... పార్టీ ప్రకటించిన ప్రకారం కార్యక్రమాలు జరగడంలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మండల, డివిజన్, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కోసమే నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో ఆచరణకు రావడంలేదు. ఎక్కువ మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ఏ పార్టీ పోటీ చేయాలనే విషయంలో స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడలేదు. రెండు పార్టీలు బరిలో దిగాలని భావిస్తున్నాయి. పైకి కూటమి గా కనిపిస్తున్నా... రెండు పార్టీలు ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నిక విషయంలో సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ముఖ్యనేతలు జిల్లాకు ఎక్కువగా వస్తున్నారు. టీడీపీ సైతం కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది. వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఇటీవలే కార్యాచరణ సిద్ధం చేసింది. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత షర్మిల పరామర్శ యూత్ర త్వరలో మొదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీ నాయకులు ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మొత్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీల్లో వరంగల్ లోక్‌సభ ఎన్నిక వేడి మొదలైంది. అధికార టీఆర్‌ఎస్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.