మీ రాక కోసం.. | For your arrival | Sakshi
Sakshi News home page

మీ రాక కోసం..

Published Fri, Jul 3 2015 12:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

మీ రాక కోసం.. - Sakshi

మీ రాక కోసం..

ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్య కేసీఆర్ రాక
జిల్లాలో రెండు రోజులు సీఎం టూర్  ఎంపీ టిక్కెట్ ఆశావహుల ఎదురుచూపు
కేసీఆర్‌తో ప్రత్యేక భేటీకి ప్రయత్నాలు

 
వరంగల్ : వరంగల్ లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో  జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పేరుకు ఉప ఎన్నిక అయినా వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఆధారంగా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోయేది స్పష్టం కానుంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారనుంది. కీలకమైన ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం ఆ పార్టీలోని దళిత నేతలు ప్రయత్నాలు తీవ్రం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జిల్లాకు రానున్నారని సమాచారం. ఆ రోజు కాకుంటే, ఈ నెల 10 లోపే కేసీఆర్ జిల్లా పర్యటన ఉంటుందని.. రెండు రోజులు జిల్లాలో  పర్యటించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు, టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. మొదట హరితహారంలో పాల్గొని రాత్రి వరంగల్‌లోనే బస చేస్తారని.. మరుసటి రోజు గ్రేటర్ వరంగల్‌లో ఇళ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది.

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఉంటుందనే సమాచారం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నాయకుల్లో ఆశలు కలిగిస్తోంది. కేసీఆర్‌ను ఎలాగైనా స్వయంగా కలిసి తమ ఆకాంక్షను తెలియజేయాలని అనుకుంటున్నారు. టీఆర్‌ఎస్ కీలక నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ద్వారా సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికివారు వ్యక్తిగతంగా కలవడంతోపాటు.. జిల్లా నేతలుృబందంగా కేసీఆర్ వద్దకు వెళ్లి స్థానిక నేతలకే టిక్కెట్ ఇవ్వాలని కోరాలని భావిస్తున్నారు.
 
పెరుగుతున్న జాబితా..
 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై గులాబీ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎన్నిక ఎప్పుడు జరుతుందనే విషయంలో స్పష్టత లేకున్నా.. టిక్కెట్ ఆశించే వారి జాబితా రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్‌ఎస్ నేతలు గుడిమల్ల రవికుమార్, జోరిక రమేశ్, పసునూరి దయాకర్, చింతల యాదగిరి, జన్ను జకారియా, ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ పి.ఎస్.సుగుణాకర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య, బూజుగుండ్ల రాజేంద్రకుమార్ టీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు, కె.కవితకు సంబంధించిన ఉద్యమ కేసులో వరంగల్ కోర్టులో న్యాయవాదిగా వ్యవహరిస్తున్న గుడిమల్ల రవికుమార్ టిక్కెట్‌పై ఆశలుపెట్టుకున్నారు. జనగామ కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ నాయకుడు డాక్టర్ పి.ఎస్.సుగుణాకర్‌రాజు.. అరుదైన శస్త్ర చికిత్సలు, దళిత ఉద్యమాలలో కీలకంగా పని చేయడం తనకు అనుకూల అంశాలని భావిస్తున్నారు. జిల్లాలోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ద్వారా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు.

కొసమెరుపు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ స్థానానికి జూన్ 11న రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో స్వయంగా కలిసి కడియం తన రాజీనామా లేఖను అందజేశారు. కడియం శ్రీహరి రాజీనామా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. దీంతో సాంకేతికంగా వరంగల్ లోక్‌సభ స్థానం ఇంకా ఖాళీ కానట్లేనని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement