రుణపడి ఉంటా
వరంగల్ అభివృద్ధికి శాయశక్తులా కృషి..
ఉద్యమం, ఎన్నికల్లో జిల్లా ప్రజలు అండగా నిలిచారు
వారి మేలు మరువలేనిది
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సీఎంను కలిసిన పసునూరి దయాకర్, జిల్లా నేతలు
హన్మకొండ : వరంగల్ జిల్లాకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన పసునూరి దయాకర్ కుటుంబసభ్యులు టీఆర్‌ఎస్ జిల్లా నాయకులతో కలిసి బుధవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిశారు. అనూహ్య విజయం సాధించిన దయాకర్‌ను సీఎం అభినందించారు. జిల్లా నాయకులు కూడా కేసీఆర్‌కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం బలహీనపడిందని అనుకున్నప్పుడు పోరాటాన్ని ఉధృతం చేసింది వరంగల్ జిల్లా ప్రజలేనన్నారు. ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని, ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థికి అఖండ మెజారిటీ ఇచ్చి మరోసారి మద్దతు తెలిపారని అన్నారు. వరంగల్‌ను రాష్ట్రంలో రెండవ పెద్ద నగరంగా అన్ని అహంగులతో తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటారుుంచి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుదామని హామీ ఇచ్చారు. స్వయంగా తానే వచ్చి కూర్చుని నగరాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తానని చెప్పారు. వరంగల్ రింగ్ రోడ్డు మంజూరు ఉత్తర్వులు రెండు రోజుల్లో జారీ చేస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్స్‌టైల్స్ పార్కును వరంగల్‌కు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు.
తమిళనాడులోని తిరుపూరు, గుజరాత్‌లోని సూరత్, మహారాష్ట్రలోని షోలాపూర్‌లా అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభించే హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రెండు, మూడు వేల ఎకరాల స్థలాన్ని సేకరించి టెక్స్‌టైల్స్ పార్కును రూపొందిస్తామని తెలిపారు. వరంగల్‌కు రైల్వే లైన్, కాజీపేటలో జంక్షన్ ఉన్నందున ఇక్కడ ఉత్పత్తి చేసే వస్తువులను దేశంలో ఎక్కడికైనా పంపించవచ్చన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ త్వరలో పర్యటిస్తానని, నియోజకవర్గ కేంద్రంలో ఉండి పరిస్థితులు సమీక్షించి అప్పటికప్పుడు అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తన వద్ద రూ.3 వేల కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటితో అప్పటికప్పుడే పనులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఉస ఎన్నిక కోడ్ ముగియక ముందే మరో కోడ్ వచ్చిందని, దీని తర్వాత కార్పొరేషన్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముందని, అరుుతే ఈ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయూల గురించి ఈసీతో మాట్లాడాలని చీఫ్ సెక్రటరీకి సూచించామని చెప్పారు. నగరంలో బీడీ కార్మికులకు పింఛన్లు అందలేదని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు సూచించా రు.
రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణాల సంఖ్య పెంచాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనకు పంపించారని తెలిపారు. తానే స్వయంగా వరంగల్‌కు వచ్చి పింఛన్లు అందిస్తానని చెప్పారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఆజ్మీర సీతారాంనాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయబాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, ఆరూరి రమేష్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, సుధాకర్‌రావు ఉన్నారు.