సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించి వివరాలు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయనీ, వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. స్కాంట్లాండ్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనావైరస్ సోకినట్లు బుధవారం గుర్తించామన్నారు. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్లొచ్చిన ముగ్గురికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మరణించలేదని స్పష్టం చేశారు.
(చదవండి: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు)
‘కరోనా’ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎప్పటికప్పుడు సీఎస్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ నివారణ చర్యలపై ఆరా తీస్తున్నామని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి దాదాపు 20 వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని, వారందరికీ సరిపడా ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సైబరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో 40 బస్సులు పెట్టి వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. విదేశాల నుండి వచ్చేవారిని నేరుగా క్వారంటైన్ కు తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. క్వారంటైన్ నుంచి బయటకు రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సెలవులు రద్దు చేశామని చెప్పారు.
రాబోయే 10-15 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా పార్కులు, మాల్స్, వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలనీ, అనవసరంగా జనసమూహంలోకి వెళ్లకూడదని ప్రజలకు సూచనలు చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది బయటకు తిరగడానికి కాదని, పిల్లలు పార్కులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. కేవలం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కరోనా తగ్గుతుందనే భావనను వీడి.. ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
‘ కరోనాను సీరియస్‌గా తీసుకోకుంటే ఇటలీలో ఏం జరిగిందో మనం చూశాం. ఇవాళ అమెరికా లాంటి చాలా దేశాల్లో కర్ఫ్యూ విధించారు. శ్రీరామ నవమి లాంటి పెద్ద పండుగను ప్రభుత్వం నిర్వహించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది బయట తిరగడానికి కాదు. పిల్లలు పార్కలు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం అందింది. పిల్లలను బయటకు పంపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి కంపెనీ, మాల్స్ లలో శానిటాయిజర్లు వాడాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వైరస్ సోకదు’ అని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment