సాక్షి, హైదరాబాద్: మీరు సక్రమంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లిస్తున్నారా? మీ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని సకాలంలో జమ చేస్తున్నారా? సమాజంలో పలుకుబడి, ప్రతిష్ట ఉన్న మీ పరపతి దెబ్బతినే విధంగా మీరు సకాలంలో జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ పన్ను కట్టడం లేదంటూ నోటీసులు వస్తున్నాయా? సమన్లూ అందుతున్నాయా? అరెస్టు చేస్తామంటూ వారెంట్లు విడుదలవుతున్నాయా? ఈ వేధింపులన్నింటికీ కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది.
పన్ను చెల్లింపు సక్రమంగా లేదంటూ డీలర్లపై ఎలాంటి విచారణ చేపట్టాలన్నా ఇక నుంచి మాన్యువల్‌గా చేస్తే ఒప్పుకోబోమని, ప్రతి డీలర్‌కు డాక్యుమెంటేషన్ ఐడింటిఫికేషన్ నెంబర్ (డీఐఎన్) ఇచ్చి ఆ నెంబర్ ద్వారా విచారణ ప్రక్రియకు సంబంధించిన లావాదేవీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల అధికారులకు లేఖలు రాసింది. పరోక్ష పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకు గాను సీజీఎస్టీ– 2017 చట్టంలోని సెక్షన్ 168 (1), కేంద్ర ఎక్సైజ్ చట్టం – 1944, సెక్షన్ (37), కస్టమ్స్ చట్టం – 1961లోని సెక్షన్ 151(ఏ)ల ప్రకారం డీఐఎన్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్టు ఈ లేఖలో పేర్కొంది.
నంబర్ జనరేట్ చేసిన తర్వాతే
జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ అయిన ప్రతి డీలర్‌కు ఈ చట్టం ప్రకారం డీఐఎన్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈనంబర్‌ను కేవలం విచారణ ప్రక్రియకు మాత్రమే పరిమితం చేస్తున్నా, మరో నెలరోజుల వ్యవధిలో అన్ని రకాల లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఈ నెంబర్ ద్వారానే తెలియజేయాలని సీబీఐసీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది కూడా. తాజాగా వచి్చన ఉత్తర్వుల ప్రకారం డీలర్ల నుంచి పన్ను వసూలు చేసేందుకుగాను సోదాలకు అనుమతివ్వడం, సమన్లు జారీ చేయడం, అరెస్టు మెమోలివ్వడం, తనిఖీ నోటీసులు పంపడం, విచారణ పేరుతో లేఖలు పంపడం లాంటివి ఈ నంబర్ ద్వారానే ఎల్రక్టానిక్ పద్ధతిలో జరపాల్సి ఉంటుంది. అలా చేయని ఎలాంటి లావాదేవీ అయినా చెల్లుబాటు కాదని రాష్ట్రాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
చాలా పరిమితమైన కేసుల్లో మాత్రమే మాన్యువల్ పద్ధతిలో విచారణ చేపట్టవచ్చని, ఇందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయడంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించిన 15 రోజుల్లోపు సంబంధిత ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఉన్నతాధికారులు అనుమతి ఇస్తున్న మాన్యువల్ ప్రక్రియను కూడా 15 రోజుల్లోగా కంప్యూటరైజేషన్ చేయాల్సిందే నని స్పష్టం చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో çపన్ను ఎగవేతదారుల నుంచి పన్ను వసూలు చేసే క్రమంలో ఇటు జీఎస్టీ, అటు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు జరిపే ప్రతి లావాదేవీ ఆన్‌లైన్‌లోనే జరగనుంది. దీంతో పన్ను వేధింపుల నుంచి తమకు ఊరట లభిస్తుందని రాష్ట్రంలోని కొందరు బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ రెవెన్యూకి రక్షణ
‘ఈ విధానం ద్వారా ప్రభుత్వం నుంచి పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి లెటర్ వచి్చనా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవీని ప్రభుత్వం స్రూ్కటినీ చేస్తుంది. నోటీసులు లేదా ఇతర లేఖలు జారీ చేసే అధికార్లకు బాధ్యత ఉంటుంది. గతంలో ఈ విధానం లేకపోవడంతో అవినీతికి ఆస్కారం ఉండేది. అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కయి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు పన్ను ఎగవేతకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ రెవెన్యూకి ఈ విధానం రక్షణగా ఉంటుంది.’
సుదీర్ వి.ఎస్, చార్టర్డ్ అకౌంటెంట్,
హీరెగంగే అండ్ అసోసియేట్స్
ప్రతి లావాదేవీ ట్రాక్..
‘ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా పన్ను చెల్లింపుదారుడు జరిపే ప్రతి లావాదేవీ ట్రాక్ అవుతుంది. లావాదేవీల తారుమారుకు అవకాశముండదు. పన్ను వసూలులో ఇది మంచి సంస్కరణ. దీని ద్వారా అసలైన డీలర్ ఎవరనేది నిర్ధారణ అవుతుంది. పన్ను చెల్లింపు విధానంలో వేధింపులు తగ్గిపోతాయి.’
గడ్డం రామకృష్ణ, చార్టర్డ్ అకౌంటెంట్,
ఎస్‌వీఆర్‌ఎల్ అసోసియేట్స్
Comments
Please login to add a commentAdd a comment