
ఆ హామీ నెరవేరిస్తే టీఆర్‌ఎస్‌కి ప్రచారం చేస్తా..
ఏడాదిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానం శుద్ధ అబద్ధమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఏడాదిలో హైదరాబాద్ వాసులకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం శుద్ధ అబద్ధమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి అన్నారు. ఆ హామీని ప్రభుత్వం నెరవేరిస్తే 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తామని అన్నారు. ఈ మేరకు వారు భగవద్గీతపై ప్రమాణం చేశారు. తమ సవాల్‌ను రాష్ట్ర సర్కారు స్వీకరించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టకపోతే ఎన్నికల్లో ఓటు అడగను అనడం కాదు... అసలు ఎన్నికల్లో పొటీనే చేయొద్దని టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని, సీఎంను కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నేటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. అబద్ధపు హామీలు ఇస్తూ.. ప్రజల్ని మోసం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.