‘డిజిటల్‌ డిటాక్స్‌’కు సమయమిదే  | Expert instructions in wake of the lockdown | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌ డిటాక్స్‌’కు సమయమిదే 

Published Sun, Apr 19 2020 1:14 AM | Last Updated on Sun, Apr 19 2020 9:53 AM

Expert instructions in wake of the lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో మనమంతా కొన్ని అలవాట్లకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా రోజువారీ జీవన విధానంలో భాగమైన డిజిటల్‌ సాధనాలకు బానిసలుగా మారిన మనం.. దాన్ని దూరం చేసుకునేందుకు వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్‌ డిటాక్స్‌ (ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిర్ణీత సమయంపాటు వాడకుండా ఉండటం) వల్ల మానసిక, శారీరక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు ఇతర అంశాలపై మనం దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. 

డిజిటల్‌ విరామాలతో మేలు... 
లాక్‌డౌన్‌ వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా అధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేదా టీవీలకు అతుక్కుపోయి కనిపిస్తున్నారు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా వాటిని వినోద సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, డిజిటల్‌ సాధనాలను ఎక్కువ గంటలు వాడరాదని సూచిస్తున్నారు. డిజిటల్‌ సాధనాలను అవసరం ఉన్నంత వరకే ఉపయోగించుకునేలా ప్రతిఒక్కరూ అలవాటు పడేందుకు ప్రస్తుత లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి పరిణామాలు దోహదపడతాయని అంటున్నారు. ‘ఈ లాక్‌డౌన్‌ రోజుల సందర్భంగా డిజిటల్‌ ప్రపంచం నుంచి ఎప్పటికప్పుడు విరామం తీసుకోవాలి. ముఖ్యంగా రోజంతా మొబైల్స్‌కు అతుక్కుపోవద్దు. పుస్తక పఠనం ద్వారా సమయాన్ని పరిజ్ఞానం పెంచుకునేందుకు ఉపయోగించాలి.

కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవాలి’అని ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్, యాలైడ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డా. నిమేష్‌ జి. దేశాయ్‌ తన అధ్యయనంలో వెల్లడించారు. గతంతో పోలిస్తే లాక్‌డౌన్‌ సందర్భంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రజలు రెండింతలకు పైగా సమాయాన్ని గడుపుతున్నట్లు ‘హ్యామర్‌ కోఫ్‌ కన్జూమర్‌ సర్వే’అధ్యయనంలో వెల్లడైంది. ఈ డిజిటల్‌ సాధనాలన్నింటిలోనూ అత్యధికంగా వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ల నుంచి ‘డీ అడిక్షన్‌’మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడటం, అది లేకుండా ఉండలేమన్నంతగా మారిపోవడాన్ని ‘రోగంగా’పరిగణించకపోయినా, దానితో వెళ్లబుచ్చే సమయాన్ని మాత్రం గణనీయంగా తగ్గించాలని సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లతో మనకు విడదీయరాని బంధం ఏర్పడినందున దాని ఉపయోగాలు, అవసరాల దృష్ట్యా వాటికి పూర్తిగా దూరంగా ఉండలేని పరిస్థితి      ఏర్పడటంతో కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.

నిపుణుల సూచనలు ఇవీ... 
► వారంలో ఒకరోజు స్మార్ట్‌ఫోన్లు లేకుండా గడపాలి. అది ఏ రోజన్నది ఎవరికి వారే ఎంచుకోవచ్చు. 
► మొబైల్స్‌తో ‘ఫిజికల్‌ డిస్టెన్స్‌’పాటించాలి. 
► బయటకు వెళ్లినప్పుడు ముఖ్యంగా వాకింగ్‌కు వెళ్తే ఫోన్‌ తీసుకెళ్లకూడదు. 
► ప్రతిరోజూ కొంత సమయం మొబైల్స్‌ తాకకుండా ఉండాలి. 
► భోజనాలు చేసేటప్పుడు ఫోన్‌ దగ్గర పెట్టుకోకూడదు. 
​​​​​​​► సెల్‌ఫోన్‌ను బెడ్రూంలోకి తీసుకెళ్లకూడదు. 
​​​​​​​► ఫోన్‌ను చూసే, వాడే సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. 
​​​​​​​► పుస్తకాలు, పత్రికల పఠనం అలవాటు చేసుకోవాలి. 
​​​​​​​► ఫోన్లో నోటిఫికేషన్‌ బటన్‌ను ఆఫ్‌ చేసి ముఖ్యమైన వాటికే పరిమితం కావాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement