గడువు పొడిగిస్తున్నా స్పందన కరువు | Extented Time Also But There Is No Response | Sakshi
Sakshi News home page

గడువు పొడిగిస్తున్నా స్పందన కరువు

Published Sun, Jul 1 2018 9:31 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Extented Time Also But There Is No Response - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : రేషన్‌ డీలర్ల సమ్మె నేపథ్యంలో గ్రామాల్లో పేదలకు ప్రజాపంపిణీ సరుకులు పంపిణీ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గడువు పొడిగిస్తున్నా రేషన్‌ డీలర్లు డీడీలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఈ నెలలో ఇబ్బందులు తప్పేలా లేవు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించి డీడీలు కట్టాలని పలు పర్యాయాలు కోరినా, గడువు పొడిగించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లే దిక్కుగా మారాయి. పేదలకు అసౌకర్యం కలుగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృమవుతాయోననే ఆందోళన అధికారులను వెంటాడుతోంది. 


నేటి నుంచి సమ్మె 
ప్రజాపంపిణీలో భాగమైన రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జూలై 1 నుండి రేషన్‌ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ గడువులు ఇస్తున్నా రేషన్‌ డీలర్లు మెట్టు దిగకపోవడం, ప్రజాపంపిణీ సరుకులకు డీడీలు చెల్లించకపోవడంతో ఐకేపీ సంఘాలను అప్రమత్తం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రజాపంపిణీపై శిక్షణ ఇవ్వడం, పంపిణీకి గ్రామాల్లో ప్రదేశాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఐకేపీ సంఘాలకు ఆర్వోలు జారీ చేయాలని సంబంధిత తహసీల్దార్లకు జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుండి   ఈ నెల 5వ తేదీ వరకు గ్రామాలకు సరుకులు చేరవేస్తామని తెలిపారు.

అయితే ప్రజాపంపిణీ సరుకులను ఈ నెల ఈ–పాస్‌ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా డీలర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం అధికారులకు   ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు డీడీలు చెల్లించేందుకు గడువు ఇస్తూ మీ–సేవా కేంద్రాల ద్వారా డీడీలు చెల్లించి ఆర్వోలు పొందేలా    డీలర్లకు అవకాశం కల్పించింది. కాగా,   జిల్లా వ్యాప్తంగా 804 రేషన్‌ షాపులకు గాను   శనివారం సాయంత్రం వరకు 27 మంది డీలర్లు డీడీలు చెల్లించారు.  కాగా, తదుపరి ఆదేశాలు   వచ్చే వరకు డీలర్లకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయొద్దని జేసీ తహసీల్దార్లకు సూచించారు. 

మట్టి తిని బతకాలా?
జడ్చర్ల: ‘ప్రజలు భోజనం చేసేలా బియ్యం అందజేసే చేతులకే అన్నం కరువైతే ఎలా.. తాము మట్టి తిని బతకాలా.. ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ రేషన్‌ డీలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసు ఇవ్వగా.. పరిష్కరించాల్సింది పోయి షోకాజ్‌ నోటీసులు, సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ శనివారం జడ్చర్ల రేషన్‌ డీలర్లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లలో మట్టి పోసుకుని భోజనం చేస్తున్న మాదిరిగా కూర్చున్నారు. న్యాయమైన సమస్యలు పరిశ్కరించాలని కోరితే సస్పెండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.250 పైగా ఇస్తున్నారని.. అంతకంటే అధ్వానంగా తమ పరిస్థితి ఉందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని డీలర్లు వాపోయారు. కార్యక్రమంలో రేషన్‌ డీలర్ల సమస్యల సాధన సమితి అధ్యక్షులు పాలాది రమేశ్, బాధ్యులు కొంగలి నాగరాజు, శ్రీనువాసులు, కృష్ణయ్య, నగేశ్, చెన్నయ్య ,తుంగ రఘు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇక డీలర్ల ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిక్‌ షాకీర్, పరమటయ్య, ఎంపీటీసీ సభ్యులు బాలవర్దన్‌గౌడ్‌ తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement