నా బూతే... నా భవిష్యత్‌! | Fake news is an existential crisis In Youtube | Sakshi
Sakshi News home page

నా బూతే... నా భవిష్యత్‌!

Published Tue, Jan 15 2019 2:20 AM | Last Updated on Tue, Jan 15 2019 2:20 AM

Fake news is an existential crisis In Youtube - Sakshi

ఆ హీరో కాపురంలో చిచ్చుపెట్టిన నటి ఎవరో తెలుసా?... 
నీలిచిత్రాల్లో నటిస్తూ దొరికిపోయిన హీరోయిన్‌...  
టాప్‌ హీరోయిన్లలో ఒకరైన ఆమెను ఫుల్లుగా వాడుకున్న స్టార్‌ హీరో...  
ఆ రాజకీయ నాయకుడు హఠాన్మరణం. చివరిచూపు కోసం ఆసుపత్రి ముందు క్యూ కట్టిన ప్రముఖులు... 
ఇవీ యూట్యూబ్‌లోని కొన్ని తెలుగు చానళ్లలో కనిపించే  తప్పుడు శీర్షికలు. సులువుగా డబ్బు సంపాదన కోసం ఆయా చానళ్ల నిర్వాహకులు వండి వారుస్తున్న అసత్య, బూతు కథనాలు. తాము అప్‌లోడ్‌ చేసే వీడియోలకు అత్యధిక హిట్లు, సబ్‌స్క్రైబర్లను సాధించేందుకు సాగిస్తున్న అరాచకాలు.
 

సాక్షి, హైదరాబాద్‌: కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కొందరు అడ్డదారిలో డబ్బు సంపాదన కోసం బూతులతో యూట్యూబ్‌ వీడియోల తయారీని ఎంచుకుంటున్నారు. నేటి ఆధునిక కాలంలో ప్రతి కుటుంబంలోనూ స్మార్ట్‌ఫోన్లు ఉండటం, సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థలు కారుచౌకగా ఇంటర్నెట్‌ డేటాను అందిస్తుండటంతో తమ యూట్యూబ్‌ చానళ్లను పాపులర్‌ చేసుకునేందుకు ఆయా నిర్వాహకులు ‘మసాలా’ఉన్న సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు. అశ్లీలం, బూతులు, అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారు. తమ వీడియోలను నెటిజన్ల చేత ఓపెన్‌ చేయించడమే లక్ష్యంగా వీడియోలు రూపొందిస్తున్నారు. యువతను ముఖ్యంగా టీనేజర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. 

సబ్‌స్క్రైబర్లు.... డబ్బుల కోసమే..  
వాస్తవానికి ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే. యూట్యూబ్‌లో వంటలు, యోగా, కరాటే, సెలబ్రిటీల వీడియోలు పెట్టి చాలా మంది పాపులర్‌ అవుతున్నారు. ఇందుకుగాను వారికి డబ్బు, గుర్తింపు లభిస్తోంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. యూట్యూబ్‌ వీడియోల ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారిని చూసి కొందరు వ్యక్తులు ఇంకా వేగంగా డబ్బు సంపాదించాలని, రాత్రికి రాత్రి సెలబ్రిటీలు కావాలనే తొందరపాటులో అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకే యువత అమితంగా ఇష్టపడే సినిమాలు, రాజకీయాలను సబ్జెక్టులుగా ఎంచుకుంటూ వాటిలో సంభాషణలను అశ్లీల, బూతులతో నింపేసి దానికి తగ్గట్లుగా రీ రికార్డింగ్, ఎడిటింగ్‌ చేసి వదులుతున్నారు.

ఇలాంటి వీడియోలకు సెన్సార్‌ లేకపోవడంతో యువత వాటిని పదేపదే చూస్తున్నారు. ఈ వీడియోలను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా వైరల్‌ చేస్తూ వదంతుల వ్యాప్తికి కారణమవుతున్నారు. ప్రముఖులపై ఇష్టమొచ్చినట్లు బురదజల్లి వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ఇలాంటి అడ్డదారుల్లో సబ్‌స్క్రైబర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తానికి తమ బ్యాంకు ఖాతాల్లో నెలనెలా లక్షల రూపాయలు పడేలా ప్లాన్‌ చేసి సఫలీకృతమవుతున్నారు. 

ఏం జరుగుతుంది? 
ఇలాంటి వీడియోల వల్ల యువత మనసు పాడవుతుందని, వారిలో పెడ ధోరణి మొదలవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌ వినియోగం విద్యార్థులకు పుస్తకాలతో సమానంగా మారింది. కానీ ఇలాంటి చానళ్ల ద్వారా మానవ సంబంధాలు దెబ్బతింటాయని నెటిజన్లు, పోలీసులు, ఎన్జీవో సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పిల్లల్లో మొండితనం, హింసాత్మక ప్రవృత్తి, నేర స్వభావాన్ని ఇలాంటి వీడియోలు పురిగొల్పుతాయని స్పష్టం చేస్తున్నారు. 

ఎలా ఆపాలి? 
వాస్తవానికి యూట్యూబ్‌ అనేది విజ్ఞానాన్ని పంచేందుకు చక్కటి వేదిక. కానీ ఇందులో ఏం అప్‌లోడ్‌ చేసినా దాని యాజమాన్యం వెంటనే స్పందించదు. దానికి లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ–మెయిల్‌ చేయాలి. అప్పుడే సంస్థ స్పందించి వాటిని తొలగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం జరిగిందుకు కనీసం ఒకరోజు సమయం పడుతుంది. ఈలోగా కొందరు ఆయా వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీనివల్ల సినీపరిశ్రమ ఏటా రూ. వందల కోట్లు నష్టపోతోంది. కానీ అంతకంటే విలువైన మానవ వనరులు, రేపటి పౌరులైన విద్యార్థుల మనసులను కలుషితం చేస్తున్న ఇలాంటి వీడియోలను ఉపేక్షించకూడదు. వాటిపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి. 

డబ్బు కోసం జీవితాలు నాశనం... 
ఇలాంటి వీడియోలు యువత మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఎడిక్షన్‌కు ఇలాంటి వీడియోలు కూడా కారణమే. త్వరగా పేరు, డబ్బు సంపాదించాలన్న ఆత్రుతతో ఇలాంటి యూట్యూబ్‌ నిర్వాహకులు టీనేజీ పిల్లలను పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా వారు మొండిగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు, లెక్చరర్లతో బూతులు మాట్లాడుతున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరస్వభావాన్ని, దుందుడుకు మనస్తత్వాన్ని పెంచే ఇలాంటి వీడియోలను నిషేధించాలి. – అనిల్‌ రాచమల్ల, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement