యూ ట్యూబ్ సంచలనం ట్రక్ డ్రైవర్: ఆయన వంటలకు నెటిజన్లు ఫిదా
మండే మోటివేషన్ అంటూ .. ఆనంద్‌మహీంద్ర ప్రశంసలు
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్‌ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్ ప్రపంచానికి తన టాలెంట్ ఏంటో చూపించి సత్తా చాటుకున్నారు చాలామంది. ఇంటి వంట,ఇంటి పంట, గాత్రం,వ్యవసాయ క్షేత్రం ఇలా ఏదైనా చివరికి తమ రోజువారీ జీవితాల్లోని మామూలు అంశాలతో వైరల్ అయి పోతున్నారు. మట్టిలో మాణిక్యాల్లా యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు అలాంటి వారిలో ఒక ట్రక్ డ్రైవర్ విశేషంగా నిలుస్తున్నాడు.
1.47 మిలియన్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లతో నెటిజన్లుల చేత 'మాస్టర్‌చెఫ్' గా ప్రశంసలు పొందుతున్న కార్గో ట్రక్ డ్రైవర్ రాజేష్ రావాని గురించి తెలుసు కుందాం రండి.
రాజేష్ రావాని ఒక ట్రక్ డ్రైవర్. వృత్తిపరంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ట్రక్ డ్రైవర్ నా జీవితంలో ఏముంది స్పెషల్ అనుకోలేదు. తన జీవితం నుంచే ఏదో సాధించాలనుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మార్చింది. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేసే వెళ్లే లారీ, ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే వారుమధ్యలో ఎక్కడో ఒక చోట ఆగి వండుకొని తినేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ రాజేష్ రావాని ఇంకొంచెం స్పెషల్. తనకొక స్పెషల్ కిచెన్ క్రియేట్ చేసుకుని నచ్చిన వంటల్ని, రుచికరంగా వండుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీన్నే స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పోస్ట్ చేయడం షురూ చేశాడు. దీనికి కొడుకుల సాయం తీసుకున్నాడు.
రాజేష్‌కు ఇద్దరు కుమారులు సాగర్, శుభం. వీరే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ప్రోత్సహించారని ఒకసారి నెటిజన్లుతో పంచుకున్నాడు. ముఖ్యంగా సాగర్ వీలైనప్పుడు ట్రక్కుపై అతనితో పాటు వీడియోలు చిత్రీకరిస్తూ, ఎడిట్ చేస్తూ ఉంటాడని చెప్పాడు. "యూట్యూబ్ అంటే ఏమిటో కూడా తెలియదు, అబ్బాయిలే ఛానెల్‌ని ప్రారంభించారని వెల్లడించాడు.
వివిధ రాష్ట్రాలకు చెందిన పదార్థాలతో ప్రయోగాలు చేస్తూండటంతో స్పందన బాగా వచ్చింది. 2021 ఏప్రిల్లో తన సొంత YouTube ఛానెల్, Instagram పేజీని ప్రారంభించాడు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. తన వెళ్లే ప్రదేశాలు, వండుకునే సూపర్ వంటకాలు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, మఠర్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకటీ రెండూకాదు రోడ్డు పక్కన జరిగిన సంఘటనలు,ఎన్నోఅద్భుతాలు వీడియోల ద్వారా నెటిజనులకు పరిచయం చేశాడు. ప్రతీ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్. సబ్‌స్క్రైబర్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. 786 వీడియోలు చేశాడు. 50, 60 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలున్నాయటే రాజేష వీడియోల క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.
ఆర్ రాజేష్ వ్లాగ్స్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు ఆయన భాష కూడా నిజంగా సూపర్ చెఫ్‌లాగా ఉండటంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో "మాస్టర్‌చెఫ్" , బెస్ట్ ఫుడ్ వ్లాగర్" గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు నెటిజన్లు అతని ట్రక్కును "ఫైవ్ స్టార్ రెస్టారెంట్" లేదా "చల్తా ఫిర్తా దాభా" అని పిలవడం విశేషం.
ఇంకో విశేషం ఏమిటంటే డ్రైవర్‌లు నిర్జన ప్రదేశంలో ట్రక్ చెడిపోయినప్పుడు, చెత్త రోడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే మరమ్మత్తు ఎలా చేసుకోవాలి లాంటివాటితో పాటు తన ట్రక్కు నుండి డ్రోన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి పాట్నాకు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌ను చూపించింది. ఈ క్లిప్‌కి ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో అతని వంటకాలు, వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. ఎనిమిది లక్షలకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లున్నారు. దీంతో సంపాదన కూడా బాగానే ఉంది. రాజేష్ కుమారుడు కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే ఇపుడొక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇద్దరూ. కొత్త ఇంటిపార్టీ వీడియోను కూడా అప్‌లోడ్ చేశాడు.
రాజేష్ సక్సెస్ జర్నీని పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్రను బాగా ఆకట్టుకుంది. మండే మోటివేషన్‌ను అంటూ రాజేష్ స్టోరీని ట్విటర్‌లో షేర్ చేశారు. 25 సంవత్సరాలకు పైగా ట్రక్ డ్రైవర్‌గా ఉన్న రాజేష్ రావాని, తన వృత్తికి ఫుడ్ & ట్రావెల్ వ్లాగింగ్ యాడ్ చేసి ఇపుడొక ఇంటి వాడయ్యాడు అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment