ఆసరా పింఛన్ల జాబితాలో పేర్లు లేవని వేర్వేరు జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.
పింఛన్ తీసుకొని వెళ్తూ..ఒకరికి గుండెపోటు
సాక్షి నెట్‌వర్క్: ఆసరా పింఛన్ల జాబితాలో పేర్లు లేవని వేర్వేరు జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన వికలాంగుడు పార్వతి కొండయ్య (51) 73 శాతం వికలాంగుడు. గతంలో పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం పింఛన్లు పంపిణీ చేయగా, తన పేరు లేకపోవడంతో బెంగతో ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఉదయం చూడగా చనిపోయి ఉన్నాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిమంగమ్మగూడేనికి చెందిన పడాల దశరథ(85) అనే వృద్ధుడుది నిరుపేద కుటుంబం. దశరథకు 10 సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛన్ వస్తోంది.
కానీ ప్రస్తుతం ప్రభుత్వం అందించే ఆసరా పథకంలో పింఛన్ మంజూరు కాలేదు. పింఛన్ కోసం అతడి కుమారులు మరోమారు దరఖాస్తు కూడా చేశారు. రెండుసార్లు దరఖాస్తులు చేసుకున్నా పింఛన్ మంజూరు కాలేదు. తీవ్ర మనోవేదనకు గురైన దశరథ మంగళవారం మృతిచెందినట్టు బాధిత కుటింబీకులు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన ఎనిగండ్ల తిరుపతమ్మ(70)కు గతంలో పింఛన్ వచ్చేది. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో వారం రోజులుగా మనోవేదనకు గురై మంగళవారం మృతి చెందింది. కాగా, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన చామకూరి వెంకటనారాయణ(62) వికలాంగుడు.
మ ంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రెండు నెలల పింఛన్ రూ. 3 వేలు తీసుకొని ఆటోలో ఇంటికి వచ్చాడు. రాగానే గుండెపోటుతో మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలోని బాహార్‌పేట కాలనీకి చెందిన మామిళ్ల లక్ష్మమ్మ(60)కు గతంలో పింఛన్ అందేది. ఇటీవల ప్రకటించిన జాబితాలో పేరు రాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకుంది. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా లిస్టులో తన పేరుందోలేదోనని ఆందోళనకు గురైన లక్ష్మమ్మ కర్ర చేతపట్టుకొని ఆతృతతో ఇంటినుంచి బయల్దేరింది. నీలకంఠస్వామి ఆలయం దగ్గరకు రాగానే కింద పడిపోయింది. అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన శాంతమ్మ(70) పింఛన్ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం మెట్లు ఎక్కుతుండగా జారి కిందపడి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం ఎల్లారెడ్డిగూడకు చెందిన కిష్టమ్మకు గతంలో పింఛన్ వచ్చేది. ఇటీవల నిర్వహించిన ఆసరా పథకం సర్వేలో భాగంగా ఆమె పేరును జాబితానుంచి తొలగించడంతో పింఛన్ రాలేదు. దీంతో ఆమె తీవ్ర మనోవ్యధకు గురైన కిష్టమ్మకు గుండెపోటు రావడంతో మృతి చెందింది.