నెట్‌వర్క్: సాగు కోసం చేసిన అప్పులు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్‌లో ఒకరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన రైతు మన్నె మాసిరెడ్డి(65) ఐదు ఎకరాలోల మొక్కజొన్న సాగు చేశాడు. దీని కోసం రూ. లక్ష అప్పు చేశాడు. దిగుబడి తగ్గడంతో అప్పు తీరే మార్గం కనిపించక బుధవారం గుళికలు మింగాడు. ఇదే జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన రైతు చిక్కొండ నారాయణ(55) నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు.
వ్యవసాయంతోపాటు, కూతురు పెళ్లి కోసం రూ. ఐదు లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి భారీగా తగ్గింది. అప్పులు తీరే మార్గం కనిపింకపోవడంతో క్రిమిసంహారక మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లికి చెందిన రైతు ఆకుల పెద్ద గంగాధర్(63) 20 ఏళ్లు గల్ఫ్‌లో ఉండి ఐదేళ్ల క్రితం వచ్చాడు. తనకున్న ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. పలుమార్లు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో ఈ ఏడాది రెండు ఎకరాలే సాగు చేశాడు. కరెంటు సరిగా లేకపోవడంతో దిగుబడి సరిగా రాలేదు. మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడతలపల్లికి చెందిన రైతు కావలి వెంకన్న(35) తండ్రితో కలిసి తమకున్న నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు గతేడాది రూ. లక్షకు పైగానే అప్పు చేశాడు. ఈ ఏడాది కూడా అప్పులు చేశాడు. అప్పుల వారి వేధింపులు పెరగడంతో మంగళవారం సాయంత్రం వ్యవసాయభూమి వద్ద క్రిమిసంహారక మందు తాగాడు.
సంస్థాన్‌నారాయణపురం మండలం అలుగుతండాకు చెందిన మహిళా రైతు కరంటోతు సునీత(25) భర్త కిషన్‌తో కలిసి పత్తిసాగు చేస్తున్నారు. సాగు కోసం రూ. 2 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి రాకపోవడం.. అప్పుల వారి వేధింపులు పెరగడంతో మనస్తాపానికి గురై మంగళవారం క్రిమిసంహారక మందు తాగింది. నేరేడుచర్ల మండలం బొత్తలపాలెం పరిధి లాలీతండాకు చెందిన రైతు బానోతు కిట్టు అలియాస్ కృష్ణ(32) రెండున్నర ఎకరాల్లో వరి, కౌలుకు తీసుకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం రూ. 4లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు దెబ్బతినడంతో క్రిమిసంహారక మందు తాగాడు.
మెదక్ జిల్లా సదాశివపేట మండలం తంగెడపల్లికి చెందిన రైతు ఎల్లారం రాములు తన ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు. సాగుకు రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. పంట దెబ్బతినడంతో అప్పులెలా తీర్చాలో తెలియక క్రిమిసంహారక మందు తాగాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి రైతు ముసిపట్ల రాజారెడ్డి (45) 3 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి వేశాడు. రెండేళ్లుగా దిగుబడి రాలేదు. పెట్టుబడి కోసం రూ.80 వేలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేక మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు.
ప్రాణాలు తీస్తున్న అప్పులు
Published Thu, Nov 13 2014 3:37 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement