
'అడిగితేనే సలహాలు...ఉచిత సలహాలివ్వం'
హైదరాబాద్ : రైతు రుణాలను మాపీ చేస్తానంటూ 2012 నుంచే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఉందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు.
దాంతో రుణమాఫీపై రైతులు ఆశపడ్డారని... అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ఒక్క ఏడాదే అని ప్రభుత్వం ప్రకటించటంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. రైతుల పరిస్థితిని కేసీఆర్ అర్థం చేసుకోవాలని అన్నారు. రైతులు అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని పొన్నాల సూచించారు.
ఇతరులను నిందించి కారణాలు వెతకటం సరికాదని పొన్నాల అన్నారు. ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తామే కానీ, ఉచిత సలహాలు ఇవ్వమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చేందుకు ప్రతిపక్షంగా సహకరిస్తామని పొన్నాల అన్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.