నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జూపల్లి
కవాడిగూడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. గురువారం ఆయన ఇందిరాపార్కు సమీపంలోని ఆప్కో లీవరీ విభాగాన్ని (స్టాక్ సప్లై) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ సప్లై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, స్టాక్ వివరాలు సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. కంప్యూటర్‌లో వివరాలను చూపించాలని ఆదేశించినా సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేయడంతో డేటాను పెన్‌డ్రైవ్‌లో తీసుకువెళ్లారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో చేనేత శాఖ మంచి రోజులు రాబోతున్నాయన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత ఆప్కో విభజన జరుగుతుందన్నారు. వీటిలో స్టాక్, బ్యాంకు బ్యాలెన్స్‌లో అధిక వాటా తెలంగాణకే దక్కుతుందన్నారు. పాఠశాలలు, ఆర్టీసీ, ఆసుపత్రులు, అంగన్ వాడీలకు ఆప్కో వస్త్రాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆప్కో మార్కెటింగ్ అధికారి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.