స్ఫూర్తి నింపిన పాలమూరు రన్ | Filled with inspiration Evaluating Run | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి నింపిన పాలమూరు రన్

Published Mon, Jun 23 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

స్ఫూర్తి నింపిన పాలమూరు రన్

స్ఫూర్తి నింపిన పాలమూరు రన్

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు 3కే రన్ స్ఫూర్తి నింపింది. షాద్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఈ పరుగులో యువజన సంఘాలు, పట్టణ వాసులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

షాద్‌నగర్: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు 3కే రన్ స్ఫూర్తి నింపింది. షాద్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఈ పరుగులో యువజన సంఘాలు, పట్టణ వాసులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ అథ్లెట్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్‌కు ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన గురుకులం విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు హాజరయ్యారు. స్థానిక సత్యసాయి పాఠశాల ఆవరణ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో అదనపు జేసీ రాజారాం, యువకులు, క్రీడాకారులు, నాయకులు, పలువురు ప్రముఖులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన దాదాపు రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని సత్యసాయి పాఠశాల ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. లక్ష్మణ్, ఎవరెస్టు వీరులు పూర్ణ ఆనంద్‌లతో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌ల కోసం స్థానికులు ఎగబడ్డారు.
 
 చదువుతో క్రీడలూ అవసరమే...
 విద్యార్థులకు, యువకులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. పాలమూరు 3కే రన్ ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడల్లో శిక్షణ అందించాలన్నారు.
 
 ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు ఆటలపై అవగాహన కల్పించాలన్నారు. క్రీడల వల్ల శారీరక సామర్థ్యంతో పాటు మానసిక స్థైర్యం కలుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో యువకులు వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించిన వారు ఉన్నారని, వారికి సరైన శిక్షణ ఇస్తే ఆణిముత్యాలుగా మారుతారన్నారు. అనంతరం ఎమ్మెల్యేను క్రీడాకారులు సన్మానించారు.రన్‌కు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. డీఎస్‌పీ ద్రోణాచార్యులు, సీఐలు గంగాధర్, నిర్మల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement