⇒ పరకాలలో ముస్తాబైన తొలి భవన సముదాయం
⇒ రేపు ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, చందూలాల్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించతలపెట్టిన నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాల పనులు ఊపందుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం కేంద్రంలో రూ.69 లక్షల వ్యయంతో భవన సముదాయం సిద్ధమైంది. మార్చి 2వ తేదీన ఈ భవనాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ ప్రారంభించనున్నారు.
క్యాంపు కార్యాలయం, నివాసం ఒకే చోట ఉండేలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భవనాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండట మే కాకుండా, ప్రజలతో తరచూ మమేకమ వడానికి అవకాశం కలుగుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే మకాం పెడు తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఎమ్మెల్యేను కలవాలంటే ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి రాజధానికి రావాల్సి వస్తోంది. దీన్ని నివారించటంతో పాటు, ఎమ్మెల్యేకు కూడా వసతిగా ఉండేలా ఈ భవనాల ప్రణాళిక రూపొందించారు.
అడ్డంకుల నడుమ ముందుకు..
పేదల కోసం ఉద్దేశించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపో వడంతో ఆ పనులు పడకేసి ఇప్పుడిప్పుడే తిరిగి మొదలవుతున్నాయి. ఎమ్మెల్యేల ఇళ్ల విషయంలో కూడా ప్రారంభంలో స్థలాల కొరత, అనువైన భూములు లేకపోవటం తదితర కారణాలతో కొంత జాప్యం జరిగినా తర్వాత కొన్ని చోట్ల పనులు మొదలయ్యాయి. పరకాలలో గతేడాది ఆగస్టులో ప్రారంభమైన భవన నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తయింది.
ప్రస్తుతం ఈ ఒక్క భవనం మాత్రమే సిద్ధం కావటంతో దాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భారీ వ్యయంతో కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మిస్తున్నందున ప్రత్యేకంగా వారికి భవనాలు కట్టడమంటే దుబారా చేయటమేనన్న విమర్శలు రావటంతో వెనక్కు తగ్గింది. హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలు పోను మిగిలిన 104 నియోజవకవర్గాల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయించినా 65 చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి.
‘పరకాల’భవనం ప్రత్యేకతలివీ..
భవనం వైశాల్యం: 4,533 చదరపు అడుగులు
నిర్మాణ వ్యయం: రూ.68.92 లక్షలు
మొదటి అంతస్తు: సమావేశ మందిరం, ఎమ్మెల్యే కార్యాలయం, వీపీపీ లాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, సిబ్బంది గదులు
రెండో అంతస్తు: మూడు పడక గదులు, డైనింగ్ హాల్, స్టోర్స్ గది, పూజ గది, వంటగది, డ్రాయింగ్ రూమ్, వరండా.