మోటార్లకు ‘పవర్‌’ పంచ్‌! | First Time History Of Telangana There Is Huge Demand For Yasangi | Sakshi
Sakshi News home page

మోటార్లకు ‘పవర్‌’ పంచ్‌!

Published Sun, Nov 24 2019 4:15 AM | Last Updated on Sun, Nov 24 2019 4:15 AM

First Time History Of Telangana There Is Huge Demand For Yasangi - Sakshi

యాసంగిలో ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఎత్తిపోతల పథకాలకు భారీ విద్యుత్‌ డిమాండ్‌ ఉండనుంది. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా ఉండటం, ఇప్పటికే రిజర్వాయర్‌లలో నీటిని నిల్వ చేసి ఉంచడంతో వాటిని ఎత్తిపోసి ఆయకట్టుకు తరలించేందుకు పంప్‌హౌస్‌ల మోటార్లను డిసెంబర్‌ నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు నడిపేందుకు విద్యుత్‌ అవసరం గణనీయంగా పెరగనుంది. ఈ యాసంగి సీజన్‌లో గరిష్టంగా 4,750మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. ఇందులో అధికంగా కాళేశ్వరంలోనే 3,500 మెగావాట్ల మేర డిమాండ్‌ ఉంటుందని తేల్చింది.

కాళేశ్వరంతో ఫుల్‌ డిమాండ్‌.. 
రాష్ట్రంలో పూర్తయిన, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల కింద మొత్తంగా 12వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని ఇప్పటికే లెక్కగట్టారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, అలీసాగర్, ఏఎంఆర్‌పీ, దేవాదుల, కోయిల్‌సాగర్‌ వంటి ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి గరిష్టంగా ఖరీఫ్, యాసంగి సీజన్‌లలో 1,200 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది. ఈ ఏడాది పాలమూరు జిల్లా ఎత్తిపోతల పథకాల ద్వారా మొత్తంగా 65 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, వీటికి 650 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం అయింది. ఈ యాసంగిలోనూ వీటి కింద 500 మెగావాట్ల డిమాండ్‌ ఉంది. ఇందులో అధికంగా కల్వకుర్తికిందే 90 రోజుల పాటు నీటిని తీసుకునేందుకు 360 మెగావాట్లు అవసరం కానుంది.

దేవాదుల పరిధిలోనూ ఇప్పటికే 10 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయగా, మార్చి వరకు మరో 10 టీఎంసీల నీటిని ఎత్తే అవకాశం ఉంది. దీనికి 300 మెగావాట్లకు పైగా విద్యుత్‌ అవసరం ఉంది. ఇక అన్నింటికన్నా ఎక్కువగా కాళేశ్వరం కింద భారీ అవసరాలు ఉండనున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసివేసి లభ్యతగా ఉన్న నీటిని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల ద్వారా దిగువ ఎల్లంపల్లికి అటు నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ వరకు ఇక్కడ ఎంత నీటి లభ్యత ఉంటే అంత నీటిని కనిష్టంగా 80 రోజుల పాటు మోటార్లను నడిపించి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పంప్‌హౌస్‌లలో మోటార్లు నడుస్తున్నాయి.

మేడిగడ్డలో 3, అన్నారంలో 4, సుందిళ్లలో 6 మోటార్లను నడిపిస్తూ రోజుకు అర టీఎంసీకి పైగా నీటిని దిగువకు తరలిస్తున్నారు. ఈ మోటార్లను నడిపేందుకు కనిష్టంగా 1,200 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటోంది. ఇక ఎల్లంపల్లి దిగువన నంది పంప్‌హౌస్‌లో 124 మెగావాట్ల సామర్థ్యం గల 5, దిగువన గాయత్రిలో 139 మెగావాట్ల సామర్థ్యం గల మరో 5 మోటార్లు ఏకధాటిగా నడుస్తున్నాయి. వీటికి 1,600 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటోంది. మొత్తంగా మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు నీటిని తరలించేందుకే 2,800 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుంది. ప్రస్తుతం మిడ్‌మానేరు దిగువ పంపులను ఆరంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. డిసెంబర్‌లో మిడ్‌మానేరు దిగువ ఉన్న ప్యాకేజీ–10, 11లోని నాలుగేసి పంపులకు డ్రైరన్‌ చేయనున్నారు.

వీటిని పూర్తి స్థాయిలో నడిపిస్తే మరో 800 మెగావాట్ల విద్యుత్‌ అవసరం కానుంది. దీనికి తోడు ఈ ఏడాది సీతారామ ఎత్తిపోతల, ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా పాక్షికంగా అయినా నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈ యాసంగిలో మోటార్లు తిరిగే రోజులు, వాటి సామర్యా్థన్ని బట్టి 4,750 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది. ప్రాజెక్టుల వారీగా నీటిని తీసుకునే రోజులు, నడపనున్న పంపులు, ఎత్తిపోసే నీళ్లు ఆధారంగా విద్యుత్‌ అవసరాలను శాఖ సీఎం కేసీఆర్‌కు నివేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement