ఐదు బిల్లులకు ఆమోదం
శాసన మండలి నిరవధిక వాయిదా: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన తెలంగాణ చెల్లింపులు, వేతనాలు, పింఛన్ల సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భూదాన్, గ్రామదాన్ సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్ మెంట్ ప్లాన్ బిల్లును మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఇవికాక మరో రెండు ద్రవ్యవినిమయ బిల్లులను కూడా ప్రభుత్వం మండలిలో ప్రవేశపెట్టింది.
ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని కొద్దిగా మెరుగు పరచి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక బిల్లును రూపొందించామన్నారు. పాత చట్టానికి 109 సవరణలు చేసినందున సవరణ బిల్లుగా కాకుండా కొత్త చట్టం రూపంలో సభ ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఏదేని కారణాలతో ఆయా వర్గాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే తదుపరి ఏడాది బడ్జెట్లో అంత మొత్తాన్ని కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగు లేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మన్నారు.
ఎపెక్స్ కమిటీ చైర్మన్‌గా ముఖ్య మంత్రి మూడేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించక పోవడంతో అధికారులలోనూ ఉదాసీనత ఏర్పడిం దన్నారు. కొత్త చట్టం ద్వారానైనా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. ఎస్సీఎస్టీ ఉపప్రణాళిక అమలులో లోపాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సమాజంలో వస్తున్న మార్పులకు ఆయా వర్గాలను దూరంగా ఉంచకూడదన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయిం చిన నిధులు ఖర్చు చేయని పక్షంలో వచ్చే ఏడాది బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా బ్యాక్‌లాగ్స్ (బకాయిలను)కలిపి నిధులు కేటాయించా లన్నారు.
భూదాన్ సవరణ బిల్లుపై చర్చలో.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ భూదాన్, గ్రామదాన్ చట్టం ద్వారా ఆచార్య వినోభాబావే ఆశయాలకు అనుగుణంగా పేదలకు భూమి పంపిణీ చేసే నిమిత్తం చట్టంలో కొన్ని సవరణలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూదాన్ చట్టం కింద ప్రస్తుతం ఎంత భూమి మిగిలి ఉంది, అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏమి చర్యలు చేపట్టారో ప్రభుత్వం తెలపాలన్నారు. భూదాన్ బోర్డు పరిధిలో ఉన్న భూములను అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు.
చెల్లింపులు, వేతనాలు, పింఛన్లు సవరణ బిల్లుపై చర్చలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లా డుతూ.. ఈ చట్టం పరిధిలో ప్రస్తుతం 120 సంస్థలు ఉన్నాయని, వక్ఫ్‌బోర్డ్‌ను కూడా చట్ట పరిధిలోకి తెచ్చేందుకు సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఆయా బిల్లు లన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. అనంతరం ఆయన శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.