స్నేక్ గ్యాంగ్‌పై ఐదు కేసులు
- నత్తనడకన సాగుతున్న విచారణ
- రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు
- ముఠా సభ్యులకు పార్టీల అండదండలు!
హైదరాబాద్: అత్యాచారాలు, సెటిల్‌మెంట్లతో హైదరాబాద్‌ను హడలెత్తించిన స్నేక్‌గ్యాంక్‌పై పోలీసులు ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేశారు. ఫాం హౌజ్‌లో యువతిపై సామూహిక అత్యాచార ఘట నకు సంబంధించి ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని, 9వ నిందితుడు సాలం హమ్‌దీ(స్నేక్‌గ్యాంగ్ సభ్యులు)లను విచారించిన పహాడీషరీఫ్ పోలీసులు శనివారం వారిని రిమాండ్‌కు తరలిం చారు.
ఇన్‌స్పెక్టర్ పి.శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకా రం.. గత నెల 31న యువతిపై జరిగిన సాముహిక అత్యాచారం ఘటనతో పాటు మరో నాలుగు కేసులలో స్నేక్‌గ్యాంగ్ సభ్యులు నిందితులు. పాములను పట్టుకున్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద స్నేక్‌గ్యాంగ్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
అలాగే, మతాంతర వివాహం చేసుకుందని ముస్లిం యువతిని బెదిరించిన ఘటనలో ఐపీసీ 295ఎ, 506, 509 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇంటిని ఆక్రమించి బెదిరించిన ఘటన, భార్యాభర్తల గొడవలో తలదూర్చి భర్తపై తీవ్రంగా దాడిచేసిన ఘటనలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, స్నేక్‌గ్యాంగ్ బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
సా...గుతున్న విచారణ..
స్నేక్‌గ్యాంగ్ సభ్యులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణను నత్తనడకన సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సెటిల్‌మెంట్లు, అత్యాచారాలు చేసి వాటిని తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్న ఈ ముఠా సభ్యులపై కొన్ని ఘటనలకు సంబంధించి మాత్రమే కేసులు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కేవలం నాలుగైదు వీడియోలే లభించాయని, డిలీట్ చేసిన వాటిని రికవరీ చేస్తామని చెప్పారు. కానీ, స్నేక్‌గ్యాంగ్ అకృత్యాలకు బలమైన సాక్ష్యాలుగా నిలిచే ఆ వీడియోలను ఇప్పటివరకు రికవరీ చేయలేకపోయారు.