
సాక్షి, హైదరాబాద్: ‘పూర్తిగా మిథనాల్, తక్కువ మోతాదులో పెట్రోల్ ఉండి ఇతర పర్యావరణ హిత చమురుతో కలసి నడిచేలా వాహనాల్లో ఫ్లెక్సీ ఇంజన్లు ఏర్పాటు చేసే పరిజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నాం. ఆ ఇంజన్లతో కూడిన వాహనాలు వస్తే దేశంలో వాహన కాలుష్యం తగ్గుముఖం పడుతుంది. మిథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలను వాడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇది పట్టణాలకు వచ్చే వలసలను నియంత్రించేం దుకు సహకరిస్తుంది’అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో జరుగుతున్న ‘ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్–2017’లో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గడ్కరీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జీడీపీలో వ్యవసాయరంగం వాటా 20 శాతానికి మించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అది జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి పట్టణ ప్రాంతాల వలసలు భారీగా తగ్గుతాయని చెప్పారు.
ఆటోమొబైల్ రంగానికి వ్యతిరేకం కాదు
2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను వాడే దేశాల్లో భారత్ స్థానం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకు ఓ పాలసీని రూపొందించే ఏర్పాట్లలో ఉన్నామని చెప్పారు. ‘మేము సాధారణ వాహనాలకు వ్యతిరేకం కాదు. ప్రస్తుతం దేశ ఆటోమొబైల్ పరిశ్రమ సాలీనా రూ.లక్షన్నర కోట్ల ఎగుమతులు జరుపుతోంది. దీన్ని కొనసాగించాలనే మేం చెప్తున్నాం. అయితే, సమస్యల్లా వాహన కాలుష్యం పెరిగిపోవటమే. అందుకే కాలుష్య రహిత వాహనాల తయారీవైపు మళ్లాల్సిందిగా ఆ పరిశ్రమకు సూచిస్తున్నాం. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు అడుగులు వేస్తున్నాం. ఇందులో తొలుత ప్రజారవాణాకు ప్రాధాన్యమిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు.
బ్లాక్‌స్పాట్ల గుర్తింపునకు కమిటీలు..
దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందు కు కృషి చేస్తున్నామని, ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి తొలగించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. స్థానిక ఎంపీ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో ఆ జిల్లా ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారని, జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా కొనసాగుతారన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి వాటి తొలగింపునకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. 2019 నాటికి బ్లాక్‌స్పాట్ ప్రమాదాలను 50 శాతానికి తగ్గించే ప్రణాళికతో పనిచేస్తున్నామని, బ్లాక్‌స్పాట్ల నివారణకు రూ.12 వేల కోట్లతో పనులు చేస్తున్నామని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా అవసరమన్నారు. ప్రస్తుతం తాము రూ.6.55 లక్షల కోట్ల విలువైన పనులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.
అందరిలోనూ సంతోషం నింపాలి
‘మీరు గొప్ప చదువు చదువు తున్నారు. భవిష్యత్తులో కంపెనీలకు అధిపతులుగా, సంస్థల్లో ముఖ్య భూమిక పోషించే పాత్రలో ఉంటారు. అది మాత్రమే చాలనుకుంటే పొరపాటు. పేదలు పైకి ఎదిగేందుకు మీ వంతుగా ప్రయత్నించాలి. ఓ గెలుపుతో మీరు సంతోషంగా ఉంటే చాలదు. మీ చుట్టూ ఉన్నవారిలోనూ సంతోషాన్ని నింపినప్పుడే అసలైన గెలుపు అనిపించుకుంటుంది’అని ఐఎస్‌బీ విద్యార్థులకు హితబోధ చేశారు. గొప్ప సంకల్పం, దాన్ని సాధించుకునే పట్టుదల, క్రమశిక్షణ, కార్యదీక్ష, సమయపాలన ప్రాధాన్యం గుర్తించాలని విద్యార్థులకు సూచించారు. కాగా, ఐఎస్‌బీకి వచ్చిన గడ్కరీతో బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు.