ఫ్లోరైడ్‌కు విరుగుడేదీ..?
జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు :సుమారు 5లక్షలు
1-18ఏళ్ల వయస్సువారు :4లక్షలు
పూర్తిస్థాయి బాధితులు :75వేలు
పాక్షిక బాధితులు :25వేలు
ఫ్లోరైడ్ నీటి సమస్య ఉన్న గ్రామాలు : 3,477
ప్రస్తుతం కృష్ణాజలాలు అందుతున్నవి : 1180
రక్షిత నీటికోసం ఎదురుచూస్తున్నవి :
700కు పైగా పైపులైన్ పనులు జరుగుతున్నవి : 400పైచిలుకు
ఫ్లోరైడ్ బాధితుల చేతులు, కాళ్లు వంకర్లు పోయాయి. నడవలేరు. వంగలేరు. నేలపై పడుకోలేరు. ఫ్లోరైడ్ చిన్నారి నుంచి ముదుసలి వరకు మూలుగ బొక్కల్ని హరించేసింది.ఈ నీటిని తాగిన జనం జీవచ్ఛవాలుగా మారిపోయారు.
మును‘గోడు’ వినేదెవరు..?
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉంది. సాధారణంగా నీటిలో ఫ్లోరిన్ 0.5 పీపీఎం (పార్ట్ ఫర్ మిలియన్) ఉండాల్సి ఉండగా, ఇక్కడ లభించే నీటి లో 16 నుంచి 18 పీపీఎం వరకు ఉంది. మర్రిగూడ మండలం బట్లపల్లిలో అత్యధికంగా నీటిలో ఫ్లోరిన్ 18 పీపీఎం ఉంది. వట్టిపల్లి, వెంకెపల్లి, క్షుదాభక్షపల్లి, మర్రిగూడ, చండూరు మండలం గొల్లగూడెంలలో నీటిలో ఫ్లోరిన్ 10 నుంచి 18పీపీఎం వరకు ఉంది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 10వేల మంది ఫ్లోరోసిస్ బాధితులున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 40శాతం వికలాంగత్వం పైబడ్డ వారు 5,951మందిగా గుర్తించారు. వీరిలో 4,556 మందికే పింఛన్లు అందుతున్నాయి.
దండిగా నిధులిచ్చిన వైఎస్సార్..
జిల్లాలో ఫ్లోరైడ్ నివారణకు తాగునీటి సరఫరా పథకం కింద చంద్రబాబు హయాంలో రూ. 50కోట్లు ఖర్చు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలను చేపట్టాక ఫ్లోరైడ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2004 నుంచి రూ.395 కోట్లు కేటాయించి, దాదాపుగా ఖర్చు చేశారు.
నత్తనడకన కృష్ణా జలాల పనులు
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు 3,477 ఉన్నాయి. వీటిలో కొన్నింటికి రక్షిత జలాలు అందుతున్నాయి. కాగా, ఫ్లోరైడ్ ప్రాంతాలైన చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం, రాజపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో కృష్ణా జలాల పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రాజెక్టుల గడువు ముగిసినా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. సూర్యాపేటకు సంబంధించి రూ.71కోట్లు ఇటీవల మంజూరైనా పనులు మొదలు కాలేదు. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలకు నిధుల ఊసే లేదు. వందలాది గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ విషపు నీటినే తాగుతున్నారు.
పడకేసిన పెలైట్ ప్రాజెక్టు..
ఫ్లోరైడ్‌ను రూపుమాపేందుకు రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామంగా మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఫ్లోరైడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించడం, రోజురోజుకూ తగ్గిపోతున్న భూగర్భజలాలను పెంపొందించేందుకు వాటర్‌షెడ్ పథకం కింద రైతుల భూముల్లో వరదకట్టలు కట్టడం, చెకుడ్యాంలు నిర్మించడం, ఫ్లోరోసిస్ బాధితులకు పౌష్టికాహారం అందించడం, ఫ్లోరైడ్‌ను నిరోధానికి అవసరమైన పండ్లు, కూరగాయల మొక్కలు పంపిణీ చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పిల్లలు ఫ్లోరోసిస్‌కు గురికాకుండా తాగుజలాలను పంపిణీ చేయడం, పాలు, గుడ్లు కూడా అందించాలి. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న బోర్లు, చేతిపంపులను గుర్తించి, ప్రజలు వాడకుండా సీజ్ చేయాలి. ప్రజలు అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి. తద్వారా ఫ్లోరైడ్ నివారించి, ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నారు. ఖుదాభక్షపల్లి గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఏడాది కావస్తున్నా, ఇంత వరకు పనులే ప్రారంభం కాలేదు. అధికారులు ఒకేఒక రోజు వచ్చి విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చేతిపంపులు, బోర్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు. మళ్లీ ఇంత వరకు గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు.
స్పీకర్ పర్యటనతో కాస్త ఊరట..
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యటనతో ఫ్లోరోసిస్ బాధితులకు కాస్త ఉపశమనం కలిగింది. వారికోసం స్పీకర్ రూ.200కోట్లు కేటాయించారు. 16ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఏడాదిలోగా లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా నెరవేరలేదు. ఫ్లోరైడ్ పీడిత 17మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గుడ్లు, పాలు అందిస్తున్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు పాలు ఇవ్వడం లేదు. ఈ మండలాల్లోని ఆయా పాఠశాలల విద్యార్థులకు కూడా గుడ్లు ఇస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. పాఠశాలల్లో వంటపాత్రలు స్టీలువి ఇస్తామని ఇవ్వలేదు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు కేటాయించినా ఫలితం లేదు. నక్కలగండి ఎత్తిపోతల పథకానికి నిధులిప్పించేందుకు కృషిచేస్తామని చెప్పినా పురోగతి లేదు. సదరన్ క్యాంపుల ద్వారా 80వేల మందికిపైగా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో 13,395మంది పింఛన్‌కు అర్హులని తేల్చారు. ప్రస్తుతం 4,200మందికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయి. 60శాతానికిపైగా వికలాంగత్వం ఉన్న వారికి రూ.500, ఆలోపు గల వారికి రూ.200 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. వెయ్యి మందికి అంత్యోదయ కార్డులు జారీ చేశారు.
సాగు, తాగు జలాలతోనే పరిష్కారం
సాగు, తాగు జలాలను అందించినప్పుడే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వర్షాలు కురవకపోవడంతో రైతులు పెద్దఎత్తున బోర్లు వేస్తున్నారు. భూమి లోతుకు వెళ్లే కొద్దీ ఫ్లోరిన్ అధికంగా ఉంటుంది. ప్రపంచంలో గుక్కెడు నీటి కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర నల్లగొండకు తప్ప ఎక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ ప్రాధాన్యంగా ఫ్లోరైడ్ సమస్యను తీసుకొని పరిష్కరించాలి.
- కంచుకట్ల సుభాష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్
పునాదిరాయి పడేదెన్నడో..?
అప్పటి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో 17మంది ఎమ్మెల్యేల బృందం 2012 జూలై 7, 8తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించింది. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. ఫ్లోరైడ్ నివారణకు గానూ మరిన్ని పరిశోధనలు అవసరమని భావించింది. చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కేంద్రప్రభుత్వం రూ.250కోట్ల వ్యయంతో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మనోహర్ ప్రకటించారు. 6నెలలు దాటినా పునాదిరాయి మాత్రం పడడం లేదు. రాష్ట్ర విభజన, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఈ కేంద్రం 10 రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సేవలు అందించనుంది. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ప్రత్యేకంగా 70 పడకల ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో తక్షణమే ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.