సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ గాయత్రి నర్సింగ్‌హోంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, భ్రూణ హత్యకు పాల్పడిన ఘటన మరో మలుపు తిరిగింది. తన భర్త, అత్తామామలు బలవంతంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, అబార్షన్ చేయించారని బాధిత మహిళ వెల్లడించింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసులో పురోగతిని వివరిస్తూ పోలీసులు మంగళవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
నల్లగొండ జిల్లాకు చెందిన ఓ గర్భిణికి హైదరాబాద్‌లోని సైదాబాద్ ఐఎస్ సదన్‌లో ఉన్న గాయత్రి నర్సింగ్ హోంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యకు పాల్పడ్డారని అంబర్‌పేటకు చెందిన ఆర్.సందీప్‌యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా పోలీసులు ఈ కేసులో పురోగతిని కోర్టుకు వివరించారు. 3 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని ఆస్పత్రి తరఫు న్యాయవాది కోరగా.. ధర్మాసనం 3 వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment