
అవును...విదేశీయులే మంచి టూరిజం ప్రేమికులు అంటున్నారు మన దేశీ టూరిస్ట్ గైడ్స్. మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఈ సీజన్‌లో ఎక్కువ మంది విదేశీయులు వస్తుంటారని, వారితో కలిసి పర్యటించి ఇక్కడి విశేషాలను వారికి వివరించడం ఎంతో ఆనందాన్నిస్తుందనివారంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: మన దేశానికి వచ్చే విదేశీపర్యాటకులను మొదట అంచనావేసేది టూరిస్ట్ గైడ్స్ మాత్రమే.వీరి మీద దేశీ పర్యాటకులకన్నా ఫారినర్సే ఎక్కువ ఆధారపడతారు. మన దేశంలో ఆతిథ్యం గురించి చెప్పేదీ వారే. సాధారణంగా సెప్టెంబర్ నెల నుంచి మార్చి వరకూ విదేశీ పర్యాటకులు వెల్లువెత్తుతారు. ఈ నేపధ్యంలో నగరానికి చెందిన పలువురు గైడ్స్ విదేశీయులతో తమకు ఎదురైన అనుభవాలను ‘సాక్షి’తోపంచుకున్నారు.
టూరిజమ్.. జీవితమ్..
మనలో ఎక్కువ మందికి ‘పర్యటన’ అంటే ఒక విలాసం, ఒక వినోదం, ఆనందం మాత్రమే. అయితే, విదేశీయులకు మాత్రం ప్రయాణాలు జీవితంలో ఓ భాగం. వారు ప్రతీది తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు.ప్రత్యేకించి సామాజిక జీవన విధానం,జంతు జీవన విధానం తెలుసుకోవాలనే ఆసక్తి వీరిలో ఎక్కువ. మన సంస్కృతి, సంప్రదాయాలు, బాంధవ్యాలు, కళలు, చారిత్రక కట్టడాలను సందర్శించి, విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారంటున్నారు నగరానికి చెందిన టూర్ గైడ్స్.
బతుకమ్మ కోసం జపాన్ నుంచి..
జపాన్ నుంచి ఓ పర్యాటకుడు బతుకమ్మ పండగ చూడటానికే గత కొన్నేళ్లుగా రాష్ట్రానికి వస్తున్నాడు. అతనికి జపాన్‌లో పువ్వుల అలంకరణ పాఠశాల ఉంది. దేవీ నవరాత్రుల సమయంలో 10 రోజుల పాటు కరీంగనర్‌లో ఉండి, ఒక్కో రోజు ఒక్కో ఇంటికి వెళ్లి బతుకమ్మ తయారీ విధానం తెలుసుకున్నాడు. విదేశీ పర్యాటకలకు మనదేశంలో ప్రతి అంశం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. వారిని గైడ్‌గా రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోతే వెంటనే మరో గైడ్‌ను వెతుక్కుంటారు. అందుకే రోజులో కనీసం 5 నుంచి 6 గంటలు పుస్తకాలు చదువుతూ, నెట్ శోధిస్తూనే ఉంటాం. – మధు, టూరిస్ట్ గైడ్
మరచిపోరు..
పర్యాటకులు మాతో కలిసి పది, ఇరవై రోజులు ఉంటారు. తమ దేశాలకు వెళ్లాక కూడా మెయిల్స్, ఫోన్లు, ఇంటర్‌నెట్ చాటింగ్ ద్వారా పలకరిస్తూనే ఉంటారు. ఒక్కోసారి కొందరు తరచుగా వస్తుంటారు. అప్పుడు మా పేరు చెప్పి, మేమే గైడ్‌గా కావాలని కోరుకునేవారు ఉన్నారు. రెండేళ్ల క్రితం టెక్స్‌టైల్ టూర్ కోసం ఓ కంపెనీ వారు న్యూయార్క్ నుంచి రాష్ట్రానికి ఐదు రోజుల పర్యటనకు వచ్చారు. పోచంపల్లి, గద్వాల, పెడన.. ప్రదేశాలను చూపుతూ, వస్త్ర పరిశ్రమకు సంబంధించి పూర్తి సమాచారం అందించాను. వారు చాలా ఇంప్రెస్ అయి న్యూయార్క్ టెక్స్‌టైల్ మ్యూజియంలో నాకు మెంబర్‌షిప్ కూడా ఇచ్చారు. – వెంకటేశ్వర్లు
మనసుకు హత్తుకున్న జ్ఞాపకం
దక్షిణాఫ్రికాలోని డర్బన్ నుంచి ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ మనదేశానికి వచ్చింది. వాళ్ల పూర్వీకులెవరో అనకాపల్లికి 40 కి.మీ దూరంలో ఉన్న జంపన అనే కుగ్రామం నుంచి దక్షిణాఫ్రికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారట. తమ మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం వందేళ్ల తర్వాత వారి మనమలకు ఒక పేపర్ కటింగ్ ద్వారా తెలిసింది. దాంతో ‘జంపన’ అనే ఊరు తెలుసుకోవడానికి మనదేశం వచ్చారు. ఆ ఊళ్లోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ తమ పూర్వీకులకు చెందిన కుటుంబీకులను కలుసుకొని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. నా ‘హృదయాన్ని స్పర్శించిన ఆ సంఘటన నాకూ కంట నీరు తెప్పించింది.– సుబ్రహ్మణ్యం
సమాచారం ముఖ్యం
వరల్డ్ హాంగ్‌కాంగ్ ఫొటోగ్రఫీ అసోసియేషన్ వారు విదేశాల నుంచి ఫొటోగ్రఫీ పోటీ కోసం ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ నుంచి కాకినాడ టు ఇచ్చాపురం వరకు కోస్తా తీర ప్రాంతంలో పది రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి ఫిషరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఉష్ణోగ్రత, చేపలు బాగా ఉండే సమయం, సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో ప్రకృతి వింతలు.. వివరాలన్నీ సేకరించాను. నేను అందించిన వివరాల ఆధారంగా పదిరోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉండి, సముద్ర జీవరాశులను కెమెరాల్లో బంధించారు.– అరవవల్లి శ్రీనివాస్‌రెడ్డి
బట్టమేక పక్షి కోసం..
ఒక విదేశీయుడు.. అంతరించిపోతున్న ‘బట్టమేక పక్షి’ కోసం మాత్రమే మన దగ్గరకు వచ్చాడు. ఆ పక్షి ఎక్కడకు వస్తుందో వెతకడానికే నాకు రెండు రోజులు పట్టింది. ఎవరెవరినో సంప్రదిస్తే రోళ్లపాడు దగ్గర నందికొట్కూరులో ఒక పక్షి ఉందని తెలిసింది. అతన్ని తీసుకొని, ఆ పక్షి కోసం బయల్దేరాను. ముందుగా ఆ పక్షి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని, అతనికి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను. – శ్రీనివాస్
పండగ పూటా వారితోనే..
పండగలు, పర్వదినాల సమయంలోనే విదేశీ పర్యాటకులతో టూర్స్ ఉంటాయి. దాంతో పండగ పూట ఇంట్లో ఉండండం కష్టమే. తరచుగా మన పండుగలను వారితో కలిసే చేసుకుంటా. కుటుంబ, వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేస్తే తప్ప ఈ వృత్తిలో విజయం సాధించలేం.– కరుణానిధి
క్రిస్మస్‌కుమా దేశానికి రండి
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు క్రిస్మస్ టూర్ల సందడి రాజుకుంటోంది. క్రిస్మస్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసే విభిన్న రకాల వేడుకలు, ప్రదర్శనలతో పలు దేశాల్లో రహదారులన్నీ సంబరాల ప్రవాహంతో తడిసి ముద్దవుతుంటాయి. గాల్లో దర్శనమిచ్చే శాంతాక్లజ్‌లు, 3డీ లైటింగ్ షోస్, ఫ్లైయింగ్ లైట్స్.. వంటి విభిన్న తరహా విశేషాలను ఆస్వాదించేందుకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్‌లు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో పలు దేశాలు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటిస్తుంటాయి. ఈ కోవలోనే స్విట్జర్లాండ్ ‘ది గ్రాండ్ ట్రైన్ టూర్’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో ఆ దేశంలోని సుందర ప్రదేశాలతో పాటు క్రిస్మస్ సందడి జరిగే ప్రాంతాలను కూడా సందర్శించేందుకు వీలు కల్పిస్తోంది. ఆ దేశంలోని జర్మట్‌లో ఈ నెల 1 నుంచి, సెయింట్ మారిట్జ్‌లో 4న ప్రారంభమైన క్రిస్మస్ మార్కెట్ ఈ సారి సందర్శకులకు కళ్లు చెదిరే అనుభూతులను అందిస్తుందని స్విట్జర్లాండ్ పర్యాటకశాఖ ప్రతినిధులు చెబుతున్నారు.