సాక్షి, హైదరాబాద్: ఆయనో పోలీస్ అధికారి.. తన సమీప బంధువులకు చెందిన కారును అపహరించారు. కారు యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు వివరాలతో ఇన్సూరెన్స్ సైతం క్లయిమ్ చేశారు. చివరకు ఫోరెన్సిక్ ఆధారాలు ఆయన నిందితుడని ప్రాథమికంగా తేల్చాయి. కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ దేవరెడ్డి.. సదరు నేరం చేశారనడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఓయూ పోలీసులు మూడు రోజుల క్రితం సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. సోమవారంలోపు తమ ఎదుట హాజరై ఆరోపణలకు సంబంధించి వివరణనివ్వాలని స్పష్టం చేశారు. దీంతో కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దేవరెడ్డిని కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
హబ్సిగూడలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివసించే రాగిడి లక్ష్మారెడ్డి భార్య రజని వెర్నా కారు (ఏపీ29 ఏఈ 0045).. 2013, మార్చి 11న చోరీకి గురైంది. దీనిపై మార్చి 14న, తర్వాత అనేకసార్లు ఉస్మానియా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె తన వాహనం ఆచూకీ కనిపెట్టడానికి భర్తతో కలసి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017, డిసెంబర్ 17న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 2015, ఏప్రిల్ 4న దేవరెడ్డి ఆ వాహనానికి ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా తీసుకున్నారని, ఆ సందర్భంలో యజమాని పేరు, వివరాలను ‘రజని.ఆర్ కేరాఫ్ దేవరెడ్డి’గా పేర్కొన్నారని తెలుసుకున్నారు. దీంతో ఆమె జరిగిన విషయం చెప్పి, ఇన్సూరెన్స్ కంపెనీని వివరాలు కోరారు.
కోర్టు ఆదేశాల మేరకు..: ఇదిలా ఉండగా దేవరెడ్డి ఆధీనంలో ఉన్న ఆ కారు ప్రమాదానికి గురైంది. 2018, జనవరి 18న రజని మాదిరిగా సంతకాలు చేసి సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లయిమ్ కూడా పొందారు. హైదరాబాద్ మెట్టుగూడలోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దేవరెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సీఐగా పని చేస్తున్నారు. ఈ తతంగంపై రజని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు దేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 25న ఓయూ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దేవరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ చోరీ, ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు చేర్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2018, జనవరిలో క్లయిమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను ఓయూ పోలీసులు సంపాదించారు. ఆ సమయంలో దేవరెడ్డి తన డ్రైవింగ్ లైసెన్సును దాఖలు చేశారని, క్లయిమ్ ఫామ్స్‌పై రజనీ మా దిరిగా సంతకం ఉన్నట్లు గుర్తించారు.
దీంతో రజని నుంచి సంతకాల నమూనాలు తీసుకున్న పోలీసులు వాటితో పాటు క్లయిమ్ ఫామ్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. క్లయిమ్ ఫామ్‌పై సంతకం చేసింది రజని కాదని ‘ఫోరెన్సిక్’ తేల్చింది. దీని ఆధారంగా ఓయూ పోలీసులు దేవరెడ్డిని నిందితుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో సోమవారంలోపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఫిర్యాదు చేసినవారు నిందితుడి సమీప బంధువులే అని పేర్కొన్నారు. నోటీసుల నేపథ్యంలో దేవరెడ్డిని కరీంనగర్ కమిషనరేట్‌కు ఎటాచ్ చేశారు. ‘మా కారును దేవరెడ్డి చోరీ చేశాడని 2013లోనే ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాం. అప్పట్లో ఆ ఠాణాలో పనిచేసిన వారు దేవరెడ్డికి వత్తాసు పలుకుతూ మా ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ప్రాథమిక ఆధారాలు సేకరించి కోర్టును ఆశ్రయించాం. అప్పుడు కేసు నమోదై, దర్యాప్తు ప్రారంభమైంది’అని రాగిడి లక్ష్మారెడ్డి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment