కేసీఆర్ ప్రమాణస్వీకారానికి కిరణ్ వస్తారా?
హైదరాబాద్: తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానం అందింది. కేసీఆర్ ఆహ్వానించనప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారానికి ఆయనను ఆహ్వానించారు. అయితే ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కిరణ్ మౌనంగా ఉండిపోయారు. అసలు ఆయనెక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఏర్పాటును కిరణ్ వ్యతిరేకించారు. విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పదవిని, కాంగ్రెస్ పార్టీని వదులుకున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లి భంగపాటుకు గురైయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ ను ఆహ్వానించారు. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కిరణ్ రాకపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని భావిస్తున్నారు.