‘సుందిళ్ల’పై సుప్రీంకు గోలివాడ రైతులు
► హైకోర్టు ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్
► జూన్ మొదటి వారంలో విచారిస్తామని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దపల్లి జిల్లా గోలివాడ గ్రామంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ పంప్ హౌస్ విషయమై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పంప్‌హౌస్ నిర్మిస్తున్న 240 ఎకరాల భూముల నుంచి తమను ఖాళీ చేయించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను ఇటీవల హైకోర్టు కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు.
రైతుల తరఫు న్యాయవాది ఆర్.ఎస్.వెంకటేశ్వరన్ బుధవారం న్యాయ మూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ గురించి ప్రస్తావించారు.రైతులను బలవంతంగా భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. గోలివాడలోని 240 ఎకరాల భూముల స్వాధీనంలో తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృ త్వంలోని ధర్మాసనం ఇదివరకే ఉత్తర్వులి చ్చిందని, దానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యహరిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ పాల్వాయి వెంకటరెడ్డి పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చారు. పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, బాధితులకు పరిహారం కూడా చెల్లించామని అన్నారు. వెంకటరెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఇప్పటికిప్పుడు ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, దీనిపై జూన్ మొదటి వారంలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.