రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
మాధవరం,(మునగాల): మండలంలోని మాధవరం గ్రామ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి మృతిచెందాడు. పోలీ సులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దాసరి వీరయ్య(53) గొర్రెలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమం లో శనివారం రాత్రి పొలం వద్ద ఉన్న గొర్రెల దగ్గరకు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు అతన్ని ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో వీరయ్య తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా మృతుని భార్య మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందడంతో వీరయ్య స్వగ్రామంలోనే ఉన్న తన కూతురు మంగమ్మ వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గంట క్రితం ఇంటకి వచ్చి భోజనం చేసి గొర్రెల వద్దకు వెళుతున్నానని చెప్పిన తండ్రి ఇంతలోనే మృత్యువాత పడటంతో అతని కూతురు నాగమ్మ బోరున విలపించింది. సంఘటన స్థలంలో స్పృహ కోల్పోయింది. మునగాల హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రహదారిపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని
గూడూరు(మిర్యాలగూడ రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టాపురంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం జాన్‌పాడ్‌కు చెందిన కోట్ల కృష్ణప్రసాద్(35) స్వగ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. కిరాణ సామాను కోసం మిర్యాలగూడకు బైక్‌పై వస్తున్నాడు. కిష్టాపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే మృతి చెం దాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాహుల్‌దేవ్ తెలిపారు.
కోదాడలో...
కోదాడఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన రెమిడాల దుర్గప్రసాద్ కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు శనివారం ఉదయం కోదాడ బస్టాండ్ ఎదురుగా కొబ్బరి బొండాలు తీసుకెళ్లేందుకు వచ్చాడు. సమీపంలోని హోటల్‌లో టిఫిన్ చేసి బయటకు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కోదాడ నుంచి ఖ మ్మం వైపు సాధిక్‌బాబా (19) అనే యువకుడు మోటార్ సైకిల్‌పై వెళ్తూ అతన్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో దుర్గప్రసాద్‌కు, సాధిక్‌బాబాకు తీవ్రగాయాలయ్యాయి. దుర్గప్రసాద్‌ను ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాధిక్‌బాబాను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. దుర్గప్రసాద్ బంధువు ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.
దైవదర్శనానికి వెళ్తొస్తూ...
నార్కట్‌పల్లి: యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లొస్తున్న ఒ వ్యక్తిని బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేతపల్లి మండలం బీమారం గ్రామనికి చెందిన పురం పాండయ్య(52), అతని భార్య సోమలక్ష్మి శనివారం ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లారు. దైవదర్శనం అంతనం స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి బస్టాండ్‌లో దిగారు. పాండయ్య వస్తువు కొనడానికి బస్టాండ్ నుంచి బయటకు వెళ్తుండగా నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు బస్టాండ్ లోపలికి వస్తూ అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన పాండయ్యను స్థానిక కామినేని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.