అంతిమ యాత్ర వాహనాలు ప్రారంభం
హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో పేదలు చనిపోతే వారి భౌతిక కాయాలను శ్మశానానికి తరలించేందుకు నగరంలో అంతిమ యాత్ర(పరమ పద) వాహనాలను మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శుక్రవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో భౌతిక కాయాలను తీసుకెళ్లేందుకు ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని వాహన చోదకులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి తలసాని అసహనం వ్యక్తంచేశారు. బెడ్‌షీట్‌లు మార్చడం లేదని, లిఫ్టులు సరిగా పనిచేయడం లేదన్నారు.
ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు ఎక్కడికక్కడ వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు త్వరలో ‘అమ్మ ఒడి’ 102 వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు.