గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద భద్రత కరువైంది. గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు.
భైంసా, న్యూస్‌లైన్ : గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద భద్రత కరువైంది. గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. ఇక్కడ వెళ్లేవారిని ఎవరూ నియంత్రించడం లేదు. సాయంత్రం దాటితే మందుబాబులు గేట్ల వద్ద జల్సా చేస్తున్నారు. తాగి ఖాళీ సీసాలు అక్కడే పారేస్తుండడంతో గాజు పెంకులు సందర్శకులకు గుచ్చుకునే ప్రమాదం ఉంది.
గజ ఈతగాళ్లు లేరు
నియోజకవర్గంలోనే గడ్డెన్నవాగు ప్రాజెక్టు పెద్దది. కాని ఇక్కడ ఒక్క గజ ఈతగా డు లేడు. వేసవిలో ఉపశమనం కోసం యువకులు, పట్టణవాసులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటారు. ప్రాజెక్టు నీటి లో జలకాలాడుతూ కనిపిస్తారు. కొంతమంది యువకులు వేసవి సెలవుల్లో ప్రాజెక్టు నీటిలో ఈత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కాని ఇక్కడ ఎలాంటి భద్రత లేకపోవడంతో ఇప్పటికే ఈతకు వెళ్లిన ఐదారుగురు యువకులు నీటి మునిగి చనిపోయారు. గత శుక్రవారం భైంసా పట్టణానికి చెందిన భానుచందర్‌గౌడ్ (రాజుగౌడ్) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు ప్రాజెక్టు వద్ద గజ ఈతగాళ్లు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఎందరో గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాజెక్టులో పడి ఇప్పటి వరకు దాదాపు 15 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాజెక్టు వద్ద భద్రత కల్పిస్తే ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చు. కాని ఎవరూ ఈ విషయాలను పట్టించుకోవడం లేదు.
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
ప్రాజెక్టు గేట్ల వద్దకు వెళ్లే రోడ్డుపై ఉన్న స్తంభాలకు అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో తీగలు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అయినా వీటిని ఎవరూ సరిచేయడం లేదు.