టాక్ ఆఫ్‌ది సిటీ: ఉంటారా.. వెళ్తారా?
సోమేష్‌కుమార్ బదిలీపై చర్చ
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఇక్కడే ఉంటారా.. లేక ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారా? అనే విషయం మరోమారు హాట్ టాపిక్‌కా మారింది. ఏఐఎస్ అధికారుల కేటాయింపుల తుదిజాబితా గురువారం విడుదలైంది. సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ మరికొంత కాలం ఆయన తెలంగాణలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐఏఎస్ అధికారుల కేటాయింపులకు సంబంధించి ఆయన క్యాట్‌ను ఆశ్రయించడం.. క్యాట్ ఆయనకు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే . తీర్పు వచ్చే వరకూ ఆయన ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ క్యాట్ ఆయను వ్యతిరేకంగా తీర్పు ఇస్తే డెప్యూటేషన్‌పై ఇక్కడ ఉండేలా ప్రభుత్వం కేంద్రాన్ని కోరే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
నగరాన్ని విశ్వనగరంగా మార్చే తలంపులో ఉన్న తెలంగాణ ప్రభుత్వ విజన్ కనుగుణంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, అధునాతన షాపింగ్‌కాంప్లెక్స్‌లు.. ఇలా వివిధ ప్రాజెక్టుల్లో ఆయన ప్రమేయం ఉంది. వీటితో పాటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగానే కాక సవాల్‌గా కూడా తీసుకున్న హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలోనూ ఆయన తనవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా నగరంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను ఇక్కడ కొనసాగించేందుకే మొగ్గు చూపుతునట్టు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనులు వేరేవారికి ఇస్తే పనులు జాప్యం అవుతాయన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఐఏఎస్‌ల కేటాయింపుల సమయంలో సోమేశ్‌ను ఇక్కడే ఉంచాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. తొలుత తెలంగాణకు కేటాయించిన తనను.. తదుపరి ఆంధ్రప్రదేశ్‌కు మార్చారంటూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ స్టే ఇచ్చింది. క్యాట్ తీర్పు అనుకూలంగా రాకపోతే ఆయన పైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారని తెలిసింది.
సోమేశ్‌కుమార్ ఫిర్యాదుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా క్యాట్ సూచించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇంతవరకు దానిని దాఖలు చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సోమేశ్‌కుమార్ వ్యవహారంలో మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే సోమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. ఇవన్నీ పక్కనబెడితే తాను మాత్రం తెలంగాణలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.