ఆయన స్టైలే వేరు
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సోమేశ్‌కుమార్.. ఈ పేరు విన్న ఎందరికోఆశ్చర్యం. అంతకుముందు పనిచేసిన కమిషనర్లతో పోలిస్తే ఇక్కడ ఏం తట్టుకోగలడు? అనే వ్యాఖ్యానాలు. ఇమడలేడు. కొరకరాని కొయ్య.. చండశాసనుడు.. అన్నీ కలబోసి ఆయనో సీతయ్య.. ఎవరు చెప్పినా వినడు. ఇదీ అంతిమంగా ఆయనకు వచ్చిన ప్రచారం. కానీ.. తోలుమందం చందంగా మారిపోయిన జీహెచ్‌ఎంసీలో ఆయన విధానాలే రోగగ్రస్త వ్యవస్థపై పనిచేసే ఔషధాలుగా మారాయి. సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...
► ఎవరికీ అంతుపట్టని సోమేశ్ కుమార్
► పని నచ్చితే వెనుకడుగు లేదు
► జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నేటితో ఏడాది పూర్తి
సాక్షి, సిటీబ్యూరో:
రూ.5కే భోజన పథకం...
..దీన్ని తలుచుకోగానే గుర్తొచ్చే పేరు సోమేశ్ కుమార్, ఐఏఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకముందే ఆ పథకాన్ని జీహెచ్‌ఎంసీలో అమలు చేసిన అధికారి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కాక ముందు సోమేశ్ కుమార్ అంటే తెలిసిన వారు తక్కువ. గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా, ఇతరత్రా హోదాల్లో పని చేసినా అంతగా ‘పేరు’ రాలేదు. ఎక్కువ కాలం వార్తల్లో కనిపిం చని పోస్టుల్లో.. ప్రచారాలకు దూరంగా విధానాల రూపకల్పనలో.. కార్యాలయ గదుల మధ్య, సుదీర్ఘ కాలం స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో గడిపిన ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్ కాగానే తన ముద్ర చూపించేందుకు యత్నించారు.
పని.. సమయం.. నిర్ణయించాక ఏది ఏమైనా పూర్తి కావాల్సిందే. ఉదయం 8 గంటలకు ఎస్‌ఎంఎస్ పంపి, 9.30 కల్లా రమ్మంటే ఎవరైనా రావాల్సిందే. అటెండరైనా.. జూనియర్ ఐఏఎస్ అయినా ఆయనకొకటే. ప్రారంభించిన పనులు పూర్తయ్యాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలన... సమీక్ష... ఏరోజుకారోజు.. ఏపూటకాపూట సమాచారం రావాల్సిందే. ఈ పనితీరే.. నిద్రపోనివ్వని తనమే జీహెచ్‌ఎంసీలో పనుల వేగానికి ఉపకరించింది.
ప్రతి పనికీ లెక్క
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులుంటే చాలు... బోలెడు ఆదాయం. దీనికీ తీవ్ర వ్యతిరేకి. పది రూపాయల పని చేసినా.. నిజంగా అంత ఖర్చవుతుందో లేదో ఆలోచించాకే మంజూరు చేసే రకం. బిల్లులపై గుడ్డిగా సంతకం చేయకుండా ప్రశ్నించడం ఆయన నైజం. ఖజానాలో నిధులున్నా ఖర్చు చేయని ఆయన ఎందరి దృష్టిలోనో పిసినారి. ఈ తత్వమే ఎందరికో ఇబ్బందిగా మారింది. పని ఎక్కువ.. పై ఆదాయం లేదు. మరోవైపు పని తప్ప మానసిక స్థితిని పట్టించుకోని తత్వం కొందరికి కష్టమనిపించింది. కన్నీళ్లూ పెట్టించింది. అయినాసరే... ఎంత గిట్టనివారైనా ఒప్పుకోక తప్పని పనితనం. కనిపించని అవినీతి. అవే సోమేశ్‌కుమార్‌కు ఆయుధాలయ్యాయి.
అవి షరా మామూలే..
పనిలో పరుగులు పెట్టించినా... ఎంత నిక్కచ్చిగా వ్యవహరించినా... అవినీతి జాఢ్యాన్ని అరికట్ట లేకపోయారు. అడపాదడపా దృష్టికొచ్చిన వాటిపైనా చర్యల్లేవు. కష్టపడేవాళ్లు కష్టపడుతూనే ఉన్నారు... దోచుకునేవాళ్లు దోచుకుంటూనే ఉన్నారనే అపప్రధ తప్పలేదు. దుబారా జరిగేచోట సాగుతూనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ రంగు
ఇవన్నీ ఒక ఎత్తయితే.. సర్కారు ఆజ్ఞలను శిరసావహించడంలో చూపిన చొరవతో కాబోలు ఆయనను ‘టీఆర్‌ఎస్ ప్రతినిధి’గా పిలుస్తారు. వేసుకున్న చొక్కా రంగుపైనా కబుర్లు. ఏ సీట్లో ఉన్నా చివరి నిమిషం వరకు అదే పనితీరు ఆయన నైజమని తెలిసిన వారు కొందరు కాగా.. పక్కా తెలంగాణవాది అన్నవారూ ఉన్నారు. స్వతహాగా బీహారీ అయినా.. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా... తీరు మారలేదు. జీహెచ్‌ఎంసీలో స్పీడు తగ్గలేదు. ఎంత చనువుగా ఉన్నారనుకున్న వారికైనా పైరవీ జరుగుతుందనుకుంటే పొరపాటే. పేదలకు ఉపాధి, అన్నార్తులకు ఆహారం వంటి వాటికి వెనుకడుగు వేయరు. ఇదీ సోమేశ్‌కుమార్ తీరు.
కొన్నాళ్లు ఇక్కడే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఐఏఎస్ అధికారుల పంపకాలకు సర్వం సిద్ధమైనప్పటికీ, తాజా సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇక్కడే ఉంటారు. కేటాయింపులపై అభ్యంతరాలు..తదితరమైనవి పూర్తయ్యేందుకు ఇంకా సమయం పట్టనుంది. జీహెచ్‌ఎంసీ పునర్విభజనకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అది పూర్తిచేసే బాధ్యత ప్రస్తుతం ఆయనపైనే ఉంది.
ఏడాది కాలంలో కమిషనర్ చేపట్టిన కార్యక్రమాలు
► రూ. 5కే భోజనం
► డ్రైవర్ కమ్ ఓనర్
► రోడ్డు డాక్టర్
► ఈ-వ్యాన్
► కాల్ సెంటర్ 040-21 11 11 11
► సమగ్ర కుటుంబ సర్వే
► 9 రోజుల్లో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు
► సార్వత్రిక ఎన్నికలు.. సమ్మెల్లో పనుల నిర్వహణ
► పారిశుద్ధ్య కార్మికులు.. సహపంక్తి భోజనాలు
► వ్యర్థాల నిర్మూలనకు పెద్ద బ్యాగులు
► ఎంపిక చేసిన మార్గాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేటుకు
► ఎస్‌ఎంఎస్‌తో పోలింగ్ సెంటర్ చిరునామా
► బేగంపేట- బల్కంపేట రోడ్డు పూర్తి
► మైత్రివనం వద్ద నీరు నిలిచే ప్రదేశం మరమ్మతులు
► చార్మినార్ పాదచారుల పథకానికి ఆస్తుల సేకరణ
► ఫోన్ -ఇన్
► నైట్‌షెల్టర్లు
► ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా ఆన్‌లైన్‌తో ఎఫ్‌ఎంఎస్(ఫైల్ మేనేజ్‌మెంట్ సిస్టం)
► ఫైలు పెండింగ్‌కు వీల్లేదు. ఆమోదమో.. తిరస్కారమో తెలియాల్సిందే.
► మెట్రోపొలిస్ నిర్వహణ
పూర్తి కావాల్సినవి
► ఎపిక్.. ఆధార్ అనుసంధానం
► జాతీయ స్థాయి మాజీ క్రీడాకారులకు పెన్షన్లు
► ఎఫ్‌ఓబీల నిర్మాణం
► శ్మశాన వాటికల అభివృద్ధి
► సిటి-జెన్ (సెల్ ఫొటోతో సమస్య పరిష్కారం)
► వాట్సప్‌తో ఫిర్యాదు
► బెగ్గర్ ఫ్రీ సిటీ
► స్వాగత ద్వారాలు