కేసీఆర్ ఎదుటే పంచాయితీ పెట్టారు!
జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ల పంచాయితీ....ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. మేయర్ మాజిద్ హుస్సేన్, కమిషనర్ సోమేశ్ కుమార్లు నిన్న అసెంబ్లీలో కేసీఆర్ను కలిశారు. ఇటీవల మేయర్, కమిషనర్ల మధ్య విభేదాలపై పత్రికల్లో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు సీఎం వారిని పిలిపించారనే ప్రచారం జరిగింది.
గత కొంతకాలంగా మేయర్, కమిషనర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి ఇద్దరు కలిసి పనిచేస్తున్నా.... ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. దాంతో వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన వారిద్దర్ని తన ఛాంబర్కు పిలిపించుకుని కలిసి పని చేసుకోవాలని హితవు పలికినట్లు తెలుస్తోంది.
జంట నగరాల్లో కూల్చివేతలపై మేయర్ మాజిద్ హుస్సేన్ అలకబూనిన విషయం తెలిసిందే. కూల్చివేతల విషయంలో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు తలెత్తాయి. కాగా ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేసీఆర్ తన ఛాంబర్కు పిలిపించుకున్నారు. మేయర్ కేసీఆర్ వద్దకు వెళ్లిన సమయంలో కమిషనర్ సోమష్ కుమార్ అక్కడ ఉన్నారు.
మేయర్ ఈ సందర్భంగా కూల్చివేతల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. కూల్చివేతల విషయంలో కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయాన్ని తమ దృష్టికి తేలేదని ఆయన తెలిపారు. దీనిపై సోమేష్ కుమార్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలోనే మరోసారి వారిద్దరూ వాగ్వివాదానికి దిగారు.
దాంతో కెసిఆర్ కల్పించుకుని అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, పరస్పరం సహకరించుకోవాలని వారికి నచ్చజెప్పారు. అయితే ముఖ్యమంత్రి గోల్కొండ కోటను సందర్శించిన సందర్భంగా తాము ఇద్దరం అసెంబ్లీకి వెళ్లినట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పుకొచ్చారు. మరోవైపు తాను సీఎంకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మేయర్ మాజిద్ చెప్పటం విశేషం.