గ్రేటర్ పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణలో ఓ అడుగు ముందుకుపడింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనను మళ్లీ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పురపాలక ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్‌తో సమావేశమై డివిజన్ల పునర్విభజన అంశాలపై సమీక్ష జరిపారు. నిబంధనలను పాటిస్తూ డివిజన్ల పునర్విభజన జరిపి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో 2011 జనాభా లెక్కల ఆధారంగా డివిజన్ల పునర్విభజన మళ్లీ జరపాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా.. వీటి మధ్య జనాభాపరంగా తీవ్ర అసమానతలున్నాయి. కొన్నింటి పరిధిలో లక్ష వరకు జనాభా ఉంటే.. మరికొన్నింటి పరిధిలో 20 వేలకు మించి లేదు. నిబంధనల ప్రకారం జనాభా వ్యత్యాసం 10 వేలకు మించి ఉండకూడదు. 2009లో నిర్వహించిన డివిజన్ల పునర్విభజనలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఈ దుస్థితినెలకొంది.
దీనిపై కొందరు వ్యక్తులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, నిబంధనల ప్రకారం మళ్లీ డివిజన్ల పునర్విభజన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు ఉండగా.. జనాభా వ్యత్యాసాలను సరిచేసేందుకు వీటి సంఖ్యను 172కు పెంచాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో డివిజన్ పరిధిలో 35 వేలకు అటూఇటుగా జనాభా ఉండేలా పునర్విభజన జరపాలని ప్రతిపాదనల్లో సూచించినట్లు సమాచారం. అయితే, ఇప్పుడే కొత్తగా ఏర్పడే డివిజన్ల సంఖ్యను ప్రకటిస్తే.. పునర్విభజన ప్రక్రియలో సమస్యలు తలెత్తవచ్చని భావించి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. డివిజన్ల పునర్విభజన కోసం జారీ చేసే ఉత్తర్వుల్లో డివిజన్ల సంఖ్యను సూచించవద్దని నిర్ణయించింది.
ఎన్నికలు వాయిదా..?
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం లేదు. జీహెచ్‌ఎంసీ పాలకవర్గ పదవీకాలం రానున్న డిసెంబర్ 3తో ముగియనుంది. డివిజన్ల పునర్విభజన, బీసీ రిజర్వేషన్ల చిక్కులు తొలగిపోయి ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడక తప్పని పరిస్థితి నెలకొంది. అదే విధంగా గత మార్చి 31న రాష్ట్రంలోని పురపాలక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పటికీ, న్యాయపరమైన చిక్కులు అడ్డురావడంతో వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట, చేగుంట, కొల్లాపూర్, అచ్చంపేట, మేడ్చెల్ పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు. కోర్టు కేసుల చిక్కులు తొలిగిపోవడంతో ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు సైతం పూర్తి చేశారు. అయితే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.